telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

గోవా విముక్తి ఉద్యమ కారుడు మోహన్‌ రనడే .. మృతి..

goa liberation activist mohan died

గోవా విముక్తి ఉద్యమ కారుడు మోహన్‌ రనడే కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మోహన్‌ రనడే కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతు..తుది శ్వాస విడిచారు. రనడేకు 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. రనడే మృతి పట్ల గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సంతాపం ప్రకటించారు. మోహన్ రనడే గోవా స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడి..పోర్చుగల్ జైలులో 14 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రనడే 1929లో పశ్చిమ మహారాష్ట్రలోని సంగ్లీలో జన్మించారు. వినాయక్ దామోదర్ సావర్కర్, ఆయన సోదరుడు గణేష్ దామోదర్ సావర్కర్ వంటి స్వతంత్ర సమరయోధులతో స్ఫూర్తి పొంది పోర్చుగీస్ వలస పాలనలో ఉన్న గోవాను విముక్తి చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.

1950లో ఒక ఉపాధ్యాయుడిగా గోవాలో ప్రవేశించిన ఆయన పోర్చుగీస్ పాలకులకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేశారు. భేటీ పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో గాయాలపాలయ్యారు. 1955లో ఆయనను అరెస్ట్ చేసి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించి పోర్చుగల్ లోని ఫోర్ట్ అఫ్ కాక్సియాన్ జైలు కు పంపారు. 1961లో గోవా విముక్తి అయినా సరే పోర్చుగీస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు జరిపినా ఆయనను విడిచిపెట్టలేదు. ఆయనను విడుదల చేయించాలంటు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న అటల్ బిహారి వాజపేయి పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీశారు. రనడే విడుదల కోసం మహారాష్ట్ర లో ప్రముఖ సంగీతకారుడు, ఆజాద్ గోమంతక్ దళ్ లో ఆయన సహచరుడైన సుధీర్ ఫడకే `మోహన్ రనడే విమోచన సమితి’ని ఏర్పాటు చేసి ఆయన విడుదల కోసం ప్రయత్నం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా విడుదల కాలేదు.

చివరకు అప్పటి మహారాష్ట్ర సీఎం అన్నాదురై వాటికన్ సిటీ పర్యటన సందర్భంగా పొప్ పాల్ VIను కలసి, రనడే విడుదల కోసం పోర్చుగీస్ ప్రభుత్వం వద్ద తమ పలుకుబడిని వినియోగించమని కోరారు. ఒక సీఎం వచ్చి తనను ఈ విధంగా అడగడంతో పొప్ ఆశ్చర్య పడ్డారు. చివరకు రనడే విడుదల అయ్యేటట్లు చేశారు. 14 ఏళ్ల పాటు జైలులో గడిపిన తర్వాత జనవరి, 1969లో రనడే విడుదల అయ్యారు. జైలు నుండి వచ్చిన తర్వాత పూణే లో స్థిరపడిన రనడే సామజిక, సేవా కార్యక్రమాలలో గడిపారు. అవసరమున్న గిరిజన, సంచార జాతులు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యా సహకారం అందించేవారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించగా, గోవా ప్రభుత్వం అత్యున్నత పౌర అవార్డు అందించింది.

Related posts