*నా ఇంటిపై దాడులు చేయిస్తారా..ఇదేనా తెలంగాణ సంస్కృతి..
*మున్నూరు రవికి అకామిడేషన్ ఇచ్చా..
*స్టీఫెన్ రవీంద్ర స్కిప్ట్‌లో నిజం లేదు..
*కేసీఆర్‌కు భయం పట్టుకుంది..అందుకే బీజేపీ నేతలపై ఆరోపణలు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బీజేపీ నేతలపై ఆరోపణలు రావడం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు.ఈ క్రమంలో..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణను ఎక్కడకు తీసుకెళుతున్నావని ప్రశ్నించారు.
తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధించాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు భయం పట్టుకుంది.. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకన్నారని అన్నారు. పీకే వచ్చి చేసేది ఏమి లేదని విమర్శించారు.
గత నెల 26న మున్నూరు రవి ఢిల్లీలోని తన నివాసానికి వచ్చినట్టుగా చెప్పారు. మున్నూరు రవి టీఆర్‌ఎస్ పార్టీకి చెందినవాడేనని తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం మున్నూరు రవి ఢిల్లీకి వచ్చాడని తన పీఏ చెప్పాడని జితేందర్ తెలిపారు.
వసతి కల్పించాలని మున్నూరు రవి కోరితే తన ఇంట్లో వసతి కల్పించినట్టుగా జితేందర్ రెడ్డి వెల్లడించారు. మున్నూరు రవిపై ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేవని అన్నారు. మున్నూరు రవితో పాటు ఢిల్లీకి ఎవరు వచ్చారో తనకు తెలియదని చెప్పారు. 28వ తేదీన రవి వెళ్లిపోయాడు.
శ్రీనివాస్ గౌడ్ ను ఎవరు ఎందుకు హత్య చేయాలనుకున్నారో చెప్పాలన్నారు. మహబూబ్ నగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎవరికైనా తన ఇంట్లో ఆశ్రయం దొరుకుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు వస్తే ఎవరైనా ఆశ్రయం ఇస్తారని చెప్పారు. ఉద్యమ కారులపై కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలని కోరారు. తాను విచారణకు సిద్దమేనని తెలిపారు.