telugu navyamedia
తెలంగాణ వార్తలు

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన: బండి సంజ‌య్ అరెస్ట్‌..

కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు నాలుగు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.తాము లేవనెత్తిన 12 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్ర‌మంలో విద్యార్ధులు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..విద్యార్థుల సమస్యలు వినడానికి వెళుతున్న తనను అరెస్ట్ చేయడమేంటని బండి సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

విద్యార్థులు వారి సమస్యలపై ఆందోళన చేస్తుంటే… కరెంట్ కట్ చేయటం, నీరు దొరకకుండా చేయడం ఏంటని ప్రశ్నించారు. వారేమైనా తీవ్రవాదులా అని మండిపడ్డారు.

సీఎం వారి సమస్యలపై స్పందిస్తే ఇంత దూరం వచ్చేది కాదని.. ఏదేమైనా వారి సమస్యలు పరిష్కరించేంతవరకూ పోరాడతామని పిలుపునిచ్చారు. బండి సంజయ్​ను బాసరకు పంపించాలని మహిళా కార్యకర్తలు, నాయకులు వాహనానికి అడ్డుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. బీజేపీ నేతలు రోడ్డుపై నిరసన తెలుపుతుండగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts