telugu navyamedia
తెలంగాణ వార్తలు

అగ్నిపథ్ ఎఫెక్ట్ : హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  అగ్నిపథ్ స్కీమ్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసింది.

సికింద్రాబాద్ రైల్వే ప్రాంగణమంతా రణరంగంలా మారింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం, రైళ్లు, బస్సులపై రాళ్లతో దాడి చేయడం, రైళ్లు తగులబెట్టడం, బైక్‌లకు నిప్పంటించడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది.

 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. మూడు రైళ్లను తగులబెట్టారు. పార్సిళ్లను రైలు పట్టాలపై వేసి కాల్చివేశారు. పలు రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు, డిస్‌ప్లే బోర్డులను పగులగొట్టారు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న దుకాణాలను ధ్వంసం చేయడంతోపాటు లూటీ చేశారు.

సికింద్రాబాద్‌లో ఆందోళన దృష్ట్యా రైల్వే వర్గాలు అప్రమత్తమైంది.ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా పలు రైల్వే స్టేష‌న్లో ప్ర‌త్యేక భ‌ద్రత ఏర్పాటు చేసింది రైల్వే శాఖ‌.

మ‌రోవైపు సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రద్దుచేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది అలాగే ఎంఎంటీఎస్, మెట్రో సేవలను అధికారులు రద్దు చేశారు .

అటు హైదరాబాద్ మెట్రో రైళ్లు రద్దు చేస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అన్ని మార్గాల్లో మెట్రో సేవలు రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

ఆందోళన దృష్ట్యా మెట్రో స్టేషన్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు ప్రారంభం కావ‌ని..ప్ర‌యాణికులు ఎవ‌రూ రైల్వే స్టేష‌న్ల‌కు రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

దీనివల్ల ఇవాళ ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

Related posts