తనదైన మధురగాత్రంతో పలుమార్లు జనానికి వీనులవిందు చేసిన మనో నేటితో 55 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మనోకు విషెస్ చెబుతూ ఆయన బాణీని గుర్తు చేసుకుందాం.
తెలుగునాట పుట్టి దక్షిణాదినే కాదు ఉత్తరాదిన సైతం తనదైన గాత్రంతో జనాన్ని కిర్రెక్కించాడు మనో. ఆయన అసలు పేరు నాగూర్ బాబు… 1965 అక్టోబర్ 26న సత్తెనపల్లిలో జన్మించిన నాగూర్ బాబు గాయకుడిగా పరిచయం కాకముందు దాసరి నారాయణరావు “నీడ” చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. తరువాత తనలోని గాత్రానికి పదును పెడుతూ ముందుకు సాగారు. నాగూర్ బాబు పేరును కాస్తా మనోగా మార్చుకున్న తరువాత ఆయన తీరే వేరయింది. ఇళయరాజా బాణీల్లో ఎన్నో మధురగీతాలను ఆలపించి జనాన్ని మురిపించారు మనో. 1990లలో మనో జైత్రయాత్ర సాగింది.
క్లాస్, మాస్ ఏదైనా సరే అదరహో అనిపించేలా ఆలపిస్తారు మనో. ఆరంభంలో కొంతమంది మనో పాడిన పాటలు విని ఎస్పీ బాలునే పాడారనీ భావించేవారు. తరువాత తనదైన బాణీ పలికిస్తూ మనో ముందుకు సాగారు. దేశవిదేశాల్లో మనో మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తూ విశేషాదరణ పొందారు. అప్పుడప్పుడూ ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకు కూడా వచ్చి అలరించే ప్రయత్నం చేస్తూంటారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.

