telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

నాన్నకు ప్రేమతో …

Birth And Development Of Ramesh Hospitals

రమేష్ హాస్పిటల్స్ నెలకొల్పి ఇప్పటికి 32 సంవత్సరాలు. ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే సమున్నత లక్ష్యంతో 1988, ఆగస్టు 15న రమేష్ హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది. ఈ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రమేష్. ఆయన మా నాన్న. డాక్టర్ గా ఆయన వృత్తి జీవితంలో ఎన్నో విజయాలు. హైదరాబాద్, ఢిల్లీ, ఇంకా విదేశాలలో ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినా, విలాసవంతమైన జీవితం గడిపేంత సంపాదనకు అవకాశం ఉన్నా, ఆయన తన జన్మభూమికి సేవ చేయాలనే సంకల్పించారు. ఆయనకు ఎప్పుడూ మార్గదర్శిగా ఉండే ఎం.ఎస్. రామ్మోహన్ రావు గారు నాన్న ఆలోచనని సమర్థించి ఆయన వెంట నిలిచారు.
Potheneni Ramesh babu

నాన్నకు ఇంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశాలు వచ్చాయి. ఇంత ఒత్తిడి, ఇంత పని భారం కూడా ఉండేది కాదేమో. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటే వారి జీవనశైలి బాగుంటుంది అని ఎంతోమంది చెప్పినా నాన్న వినలేదు. ఆయన తన బాటని వీడలేదు. ఆయన లక్ష్యం – తన ప్రజలకు సేవ చేయడమే.

ఒక డాక్టర్ గా ఆయన జీవితాన్ని గొప్పగా ప్రభావితం చేసిన వారు – ప్రొఫెసర్ భాటియా. ఎయిమ్స్ (AIIMS) లో నాన్న చదివే రోజులలో ప్రొఫెసర్ భాటియా ఆలోచనా సరళి నాన్నని ఎంతగానో ప్రభావితం చేసిందని ఆయన చాలా సందర్భాలలో మాతో చెప్పారు. నాన్న ఎప్పుడూ అంటూండే వారు, వైద్యులకు బోధించడం తనకి చాలా ఇష్టం అనీ, తన లాగా పది మందిని తయారు చేయాలన్నది తన ఆలోచన అనీ. తను అత్యుత్తమ వైద్యుడిని అని ఆయన చెప్పుకోవడానికి ఎప్పుడూ సంకోచించే వారు కాదు. అది ఆయన నమ్మకం. మహాభారతంలో అర్జునుడు కూడా ఒక పక్షి కంటిని గురి పెట్టినప్పుడు, ఒక్క కన్ను మాత్రమే కనబడుతోంది అని చెప్పడానికి అర్జునుడు సంకోచించలేదు. ఎందుకంటే, అది చాలా మామూలు నిజం. గర్వం కాదు, అహంకారం కాదు. సంకల్పానికి సంకోచాలు అవసరం లేదు. అది మనసా వాచా కర్మణా ఆచరించవలసిన అంశం.

డాక్టర్ రమేష్ గారు ఎప్పుడూ వైద్య సేవలనే పరమావధిగా భావించారు. ఆయన మూఢ మత విశ్వాసాలనీ, మూఢ నమ్మకాలనీ ఎప్పుడూ విశ్వసించలేదు. ఒక మంచి పని చేయడానికి మంచి ముహూర్తం ఎందుకు అని నవ్వేయడమే ఆయన నైజం.ఆయన ఇంకో మాట కూడా ఎప్పుడూ అంటుండే వారు. “భూమి తన చుట్టూ తాను తిరిగిన అన్ని రోజులూ, భూమి సూర్యుడి చుట్టూ తిరిగే అన్ని రోజులూ… మంచి రోజులే.”డాక్టర్ రమేష్ గారి గురించి ఈ రోజు మీకు మరికొన్ని విషయాలు చెబుతాను. ఆయన తనయగా సగర్వంగా ఆ విశేషాలను మీతో పంచుకుంటాను. నేను ఎదిగే వయస్సులో ఒక కుమార్తెగా ఆయన మీద ఎప్పుడూ ఎన్నో కంప్లయింట్లు ఉండేవి. నా జీవితమంతా ఆయనని మిస్ అవుతూనే వచ్చాను. ఆయన ఎప్పుడూ 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ, సంవత్సరం మొత్తం ఫోన్లలోనే ఎక్కుువ గడిపే వారు. ఆ విషయం మీకూ తెలిసే ఉంటుంది.

ఆయన ఎప్పుడూ మా స్కూలు మీటింగ్స్ కి, స్కూలు వేడుకలకీ హాజరు కాలేకపోయారు. కొన్నిసార్లు పుట్టినరోజు వేడుకలకు కూడా రాలేకపోయే వారు. సెలవులు అనేవి మాకు చాలా అరుదు. మేము హోటళ్లకు వెళ్లినా సగం భోజనంలోనే వెళ్ళిపోయేవారు. సినిమాలు కూడా ఆయన సగం సగం చూడడమే! ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను నాన్నని మిస్ అవుతున్నందుకు చాలా సందర్భాలలో ఏడ్చే దానిని.

నాకు ఢిల్లీలోని మా చిన్నతనపు రోజులే ఎప్పుడూ బాగుండేవి. ఆయనతో ఎక్కువ సేపు గడిపే అవకాశం అప్పట్లో ఉండేది.
మేము ఎయిమ్స్ క్వార్టర్లలో ఉండే రోజుల్లో, మాది ఒక బెడ్ రూమ్ ఇల్లు. నా తమ్ముడు అక్కడే పుట్టాడు. మేము చిన్న చిన్న వేడుకలు జరుపుకొంటూ సంతోషంగా ఉండే వాళ్లం. డాక్టర్ లోకేశ్వర రావు గారూ, డాక్టర్ ప్రభాకర్ గారూ ఆయనకు ముఖ్య స్నేహితులు. ఆయన అప్పుడు కూడా ఎంతో కష్టపడి పని చేశారు వారు. అయినా, మేము కలిసి భోజనం పూర్తిగా చేయగలిగిన రోజులు అవి.

మేము డిల్లీ నుండి విజయవాడకు తరలి వచ్చినప్పుడు – నా వయస్సు ఏడేళ్లు. నాకు ఇక్కడి వాతావరణం నచ్చలేదనీ, ఢిల్లీలో మా ఇంటిని మిస్ అవుతున్నాననీ బాధపడేదానిని. నాకు పద్నాలుగేళ్లు వచ్చే వరకూ, మా ఢిల్లీ జీవితమే అందంగా ఉండి ఉండేదని భావించే దానిని. నేనూ, నా తమ్ముడూ మా స్కూలు అయిపోయాక హాస్పిటల్ కి వెళ్లి అక్కడే చదువుకునే వాళ్లం. నాన్న OPD లో బిజీగా ఉంటే, మేము ఆయన పక్కనే కూర్చుని హోమ్ వర్కు చేసుకునే వాళ్లం. ఎందుకంటే, నాన్నని కలుసుకోవడానికి, ఆయనతో కొంత సమయం గడపడానికి మాకు అదే పెద్ద అవకాశం, ఆ రోజుల్లో,చాలా ఏళ్ల పాటు ఆయన మేము నిద్రపోయాకే ఇంటికి వచ్చేవారు. మేము లేచే సరికే ఆయన వెళ్లిపోయే వారు.

మాకు హాస్పిటల్ ఒక విధంగా ఇల్లు అయిపోయింది. మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పటికీ అదే పరిస్థితి కూడా. అప్పట్లో , అంటే 1990 నాటి రోజులలో, మా ఇంటిలో సగ భాగాన్ని హాస్పిటల్ గా మార్చారు. ఎందుకంటే, పేషంట్లకు అదనపు బెడ్స్ అవసరం అయ్యాయని. అందుకే మా సింగిల్ బెడ్ రూమ్ కీ, పేషంట్లు ఉండే గదికీ ఒక కామన్ తలుపు ఉండేది. ఈ నిజం చెబితే మీరు నమ్మరు, అప్పట్లో మేము రెండు పరుపులు OPD గదిలో వేసుకుని అక్కడే నేల మీద పడుకునే వాళ్లం. ఎందుకంటే ICU కాకుండా ఏసీ ఉండిన మరో గది అదొక్కటే.అవి సంతోషకరమైన రోజులు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు. అప్పట్లో ఏ ఒక్క పేషంట్ ప్రాణాన్ని కాపాడగలిగినా, తనకు భారతరత్న అవార్డు వచ్చినంత గొప్పగా నాన్న భావించే వారు.

ఆయన కుటుంబం పెరిగిపోతుండటాన్ని, ఆయన కలని నిజం చేయడానికి సహకరించే ఆయన ఉద్యోగులు మా కుటుంబంలో భాగం కావడాన్ని నేను చాలా కాలం జీర్ణించుకోలేకపోయే దానిని. మా సంస్థలో తొలి ఉద్యోగి హనుమంత రావు గారు. మా జీవితాలలో ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి ఆయన . మా అమ్మ ఎప్పుడూ అనేది, ఆయన మన ఇంటి పెద్ద కొడుకు అనీ.ఎప్పుడూ తెల్లని దుస్తులు ధరించి, చెరగని చిరునవ్వుతో కనిపించే హనుమంతరావు గారు, ఎంతో హుందాగా వ్యవహరించే వారు . ఆయన కుమార్తె పద్మజ, నేను ఒకే చోట చదువుకునే వాళ్లం. ఇంకా నా చిన్నతనం నుండి నాకు గుర్తున్న వారు డాక్టర్ సుదర్శన్ గారూ, డాక్టర్ కల్యాణ్ గారూ, గణపతి, ఇంకా చాలా మంది నాన్నకు ఆప్తులు, ఆత్మీయులు, సన్నిహితులు. వరలక్ష్మి గారు మా అమ్మకి సంగీత పాఠాలు నేర్పేవారు. నేను స్కూలుకు వెళ్లేప్పుడు, నాకు జడ వేసే వారు. ఆవిడ మా నాన్నకి రాఖీ సోదరి. అలాగే, మా హాస్పిటల్ లో ఆయాలు, నర్సులూ, డాక్టర్లూ కూడా క్రమంగా మా కుటుంబ సభ్యులుగా కూడా మారిపోయారు.

తన శక్తికి మించి, వంద శాతం కన్నా ఎక్కువగా కష్టపడిన రోజు… మా నాన్నకి సంతృప్తికరమైన రోజు. మా ఇంటి దేవత, ప్రేమమూర్తి అయిన మా అమ్మ శ్రీమతి మహాలక్ష్మి నేను ఎప్పుడు ఫిర్యాదులు చేసినా ఈ మాటలు అంటుండేది – “నాన్న చేస్తున్న పని అన్ని పూజల కన్నా పెద్ద పూజ. మనం ఎప్పుడూ దానికి అడ్డు చెప్పకూడదు. ఆయన చేసే ప్రతి మంచి పనికీ నేను ఆయన తోడు ఉంటాను, మీరు కూడా ఉండాలి. సరదాలు జీవితంలో ఎప్పుడయినా ఎంజాయ్ చేయవచ్చు, పేషంట్ కి సీరియస్ గా ఉందని ఫోన్ వస్తే, తినే ప్లేటు ముందు నుంచి ఆయన వెళ్లిపోవడమే కరెక్టు” అని. భోజనం మధ్యలో లేచి వెళ్లడం, సగం నిద్రలో లేచి హాస్పిటల్ కి హడావుడిగా వెళ్లడం, వేడుకల మధ్యలో వెళ్లిపోవడం… వేల సందర్భాలలో జరిగేవి.

ఈ మధ్య కూడా, 2011 లో లయోలా కళాదర్శినిలో నా ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతున్న సందర్భంగా, ఆయన చాలా సంతోషంగా – నీకేం కావాలమ్మా – అని అడిగారు. మన కుటుంబం అంతా కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చూద్దాం నాన్నా అని అడిగాను. మా తాతయ్య, బామ్మ, బాబయ్యలూ, మావయ్యలూ, పిన్నిలూ, అత్తయ్యలూ, కజిన్స్, పిల్లలూ, మా అబ్బాయి, ఇలా మా కుటుంబం మొత్తం సినిమా చూస్తున్నాం. కానీ, ఫస్ట్ హాఫ్ అయ్యే లోపే ఆయనకి ఎమర్జెన్సీ ఫోన్ రావడం, ఆయన వెళ్లిపోవడం జరిగింది. అప్పటికి నాకు 30 ఏళ్లు. నేను బాధపడలేదు, కంప్లయింట్ చేయలేదు. కానీ ఆయనని మిస్ అవుతున్నానన్న బాధ, ఆయనతో ఎక్కువ సేపు సమయం గడపాలన్న ఆకాంక్ష నా జీవితమంతా ఉంటాయి అనుకుంటా.
నేను తీవ్ర అనారోగ్యానికి గురైన సమయంలో 7 నెలల పాటు ఆయన నన్ను కంటి పాపలా దగ్గరుండి చూసుకున్నారు. సర్జరీ ఇంకా వైద్య ప్రక్రియల కోసం నన్ను అమెరికా, ఇంకా ఢిల్లీలోని మెడాంటా హాస్పిటల్ కు తీసుకెళ్లిన సందర్భాలలో సైతం ఆయన చేతిలో ఎప్పుడూ పెన్నూ, నోట్ బుక్ ఉండేవి. అక్కడి వైద్యులతో మాట్లాడే సమయంలో వారు చెప్పిన పాయింట్లను నాన్న నోట్ చేసుకుంటూ ఉండే వారు. ఆ వైద్య విదానాలను, ప్రక్రియలనీ మన హాస్పిటల్ లో ఎలా అమలు చేయవచ్చు అని ఆలోచన చేసే వారు. మన హాస్పిటల్ ని ఒక మంచి హాస్పిటల్ గా ఎలా మార్చాలి అనేదే ఆయన నిరంతర తపన. హాస్పిటల్ ప్రమాణాలను ఎలా మెరుగుపరచాలన్నదే ఆయన ఆలోచన.

అప్పుడు ఆయన నాకు రెండు విషయాలు గురించి చెప్పారు. నా అనారోగ్యాన్ని ఎలా నయం చేయాలి, మనం తిరిగి హాస్పిటల్ కి వెళ్లాక ఈ వైద్య విజ్ఞానాన్ని మన హాస్పిటల్ లో ఎలా అమలు చేయాలి… ఈ రెండే ఆయన ముఖ్యమైన ఆలోచనలు అని చెప్పే వారు. అడ్వర్టయిజ్మెంట్లు ఘనంగా ఇవ్వడం కాదు, రుజువర్తనం ముఖ్యం అన్నది నాన్న భావన. నా జీవితంలో నేను ఎదుర్కొన్న సవాళ్లకు, నా ఆరోగ్యపరమైన అంశాలకూ నాకు శక్తి, స్పూర్తి అన్నీ నేను మా నాన్న నుండి పొందినవే. ఆయన తన జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రయోజనకరంగా మార్చుకునే తీరు, అందుకు ఆయన చూపే ఉత్సాహం నాకే కాదు, ఎందరికో అది ఆదర్శం. రమేష్ గారి దృష్టి లో ఫ్యామిలీ అంటే రమేష్ హాస్పిటల్. ఆయనకు ఎప్పటికీ అదే మొదటి స్థానంలో ఉంటుంది . ఈ సంస్థ ని ఆయన కన్న బిడ్డలా చూసుకుంటారు. బహుశా, ఈ క్లిష్టమైన కాలంలో, మనం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయం కాబట్టి, ఈ విషయాలను మీతో పంచుకోవాలి అనిపించింది. ఎందుకంటే, నేను కూడా మీ మనిషిని. మీలో ఒకరిని.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, అది మన సంస్థ వార్షికోత్సవం కూడా. ఇది శ్రీ హనుమంత రావు గారిని గుర్తు చేసుకునే సందర్భం. మనం జెండాని ఎగురవేసే సమయంలో ఈ గొప్ప వ్యక్తిని ఒకసారి స్మరించుకుందాం. మన కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన మన కుటుంబ సభ్యుడు శ్రీ హనుమంతరావు గారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చిరునవ్వుతో పై నుండి మనల్ని చూస్తూనే ఉంటారు. మనకి ఆశీస్సులు అందిస్తునే ఉంటారు. మన దేశ పతాకం ఎప్పుడూ గర్వంగా ఎగరాలి. మన సంస్ధ విజయపథంలో పయనించాలి. ఆ దేవుని చల్లని దీవెనలు మనకు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు.

జై హింద్.

మీ
మధు స్మిత

Related posts