భారతదేశం మరో ఘనతను మూటకట్టుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక నగరాన్ని నిర్మించిన ఘనత ఇది. ఇది కూడా ఊరికే ఊసుపోక, రికార్డుల కోసం చేసింది కాదు, ఒక మంచి ఉద్దేశ్యంతోనే ఇటువంటి ఏర్పాటు చేయబడింది. పుణ్యం-పురుషార్థం అన్నట్టుగా అటు తాత్కాలిక ప్రయోజనం మరియు ఇటు రికార్డు రెండు సాధించాం. విషయానికి వస్తే, మరికొన్ని రోజులలో కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం, యాత్రికులు, భక్తులకు స్వాగతం పలికేందుకు ప్రయాగ్ రాజ్ లో సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు కోట్లాది మంది హాజరుకానుండటంతో, యోగి ఆదిత్యనాథ్ సర్కారు రూ. 2,800 కోట్లను కేటాయించింది. ఇతర నిధులు, ఖర్చులు కూడా కలిపితే, కుంభమేళా నిర్వహణకు పెట్టబోయే ఖర్చు రూ. 4,300 కోట్లు దాటుతుందని అంచనా.
దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనలు తాత్కాలిక నగరం కోసం ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 40 వేల ఎల్ఈడీ బల్బులు ఈ నగరానికి కాంతులను అందించనున్నాయి. ఈ ఉత్సవాలకు భద్రతను కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పటికే ప్రారంభమైంది. తాత్కాలిక నగరం మొత్తాన్నీ సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచారు.
ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా, భక్తులు నది వద్దకు చేరడం, ట్రాఫిక్ మళ్లింపులు తదితరాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. మొత్తం 20 వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వర్తించనున్నారని ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాలో భద్రతా విధులు నిర్వహించే పోలీసులు శాకాహారం మాత్రమే తీసుకుంటారని, మద్యం ముట్టబోరని యూపీ డీజీపీ కేపీ సింగ్ వ్యాఖ్యానించారు. జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుండగా, 192 దేశాల నుంచి సుమారు 12 కోట్ల మంది వరకూ వస్తారని అంచనావేస్తున్నారు. ఇంతపెద్ద సెట్టు అయితే వేశారు గాని, అది యాత్రికులను ఆకర్షించి క్లిక్ అవుతుందా.. అనేది వేచి చూడాల్సి ఉంది.