విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా శ్రీలంక పర్యటనలో యువ ఆటగాళ్లకు బీసీసీఐ చోటు కల్పించింది. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత్‌కు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉంటారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బీసీసీఐ వర్గాలూ ఇదే విషయం స్పష్టం చేశాయి. తాజాగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిని ధ్రువీకరించారు. ‘శ్రీలంక టూర్‌కి వెళ్లబోయే భారత జట్టుకి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉంటారు’ అని గంగూలీ తాజాగా ప్రకటించారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్‌ని శ్రీలంక టూర్‌కి కోచ్‌గా ఉండమని బీసీసీఐ ఇటీవల రిక్వెస్ట్ చేయగా.. అందుకు ద్రవిడ్ అంగీకరించారు. గతంలో అండర్-19, భారత్-ఏకు కోచ్‌గా మిస్టర్ డిపెండబుల్‌కు ఎంతో అనుభవం ఉంది. ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉంది. లంక పర్యటనకూ అప్పటి ఆటగాళ్లే ఎంపికవ్వడంతో ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించినట్టు తెలిసింది.
previous post
next post