telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని అభివృద్ధి పనులపై వివరాలు ఇవ్వండి: ఏపీ హైకోర్టు ఆదేశం

ap high court

రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, హైకోర్టు తరలింపు వ్యవహారాలపై పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు వంటి పలు అంశాలపై దాఖలైన వివిధ కేసులపై నిన్న హైకోర్టు విచారణ జరిపింది.

రాజధాని పరిధిలోని అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు వెంటనే వాటిని పునరుద్ధరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అలాగే, హైకోర్టు తరలింపు అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని, అమరావతిలో శాశ్వత హైకోర్టు నిర్మాణాలను కొనసాగించేలా ఆదేశించాలని కోరారు.మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనుల్ని కొనసాగించాలని మరో న్యాయవాది కోరారు.

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ తన వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే రాజధానిని తరలిస్తోందని, ప్రభుత్వం మారినా విధానపరమైన నిర్ణయాలు మారడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలను అంశాల వారీగా విభజించి విచారణ జరపడం మంచిదని పేర్కొంది. రాజధానికి నిధులు ఇచ్చినందున ఈ వ్యాజ్యాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

Related posts