telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరు..

మనిషికి చదువే నిజమైన ఆస్తి అని, స‌మాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. విద్యారంగంలో మూడేళ్లలో సమూలమార్పులు చేశామని, బడికి వెళ్తేనే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు ..జగనన్న అమ్మఒడి పథకం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిన కార్యక్రమం అని జగన్ తెలిపారు.

1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూర్చే విధంగా 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలకు బడికి వెళ్తేనే చదవు వస్తుందని.. అందుకే 75శాతం హాజరును తప్పనిసరి చేస్తూ జీవోలో పొందుపరిచామని జగన్ వివరించారు

ఏ ప్రభుత్వమైన చదువుపై పెట్టే ఖర్చు ఓ పవిత్రమైన పెట్టుబడి అని సీఎం అభిప్రాయపడ్డారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దువు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆదాయం కూడా చాలా ఎక్కువన్నారు.

ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్‌.. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని.. అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ఆయన చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజ్యుస్ యాప్తో ఒప్పందం చేసుకున్నామని, శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజ్యుస్ యాప్ ఇప్పుడు పేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. 4.7 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు సెప్టెంబర్‌లో రూ. 12వేలు విలువజేసే ట్యాబ్ ఇవ్వబోతున్నామన్నామని సీఎం జగన్ చెప్పారు.

అమ్మఒడి పథకంపైనా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మఒడి పథకాన్ని విమర్శించే వారిలో ఒక్కరైనా పిల్లల్ని చదివించే తల్లులకు ఒక్క రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమ్మఒడి లాంటి పథకం తెచ్చారా అని ప్రశ్నలు సంధించారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే దుష్టచతుష్టయానికి నిజాలు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. మారీచులు, దుష్టచతుష్టయంతో యుద్దం చేస్తున్నామని అన్నారు. దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా, దత్తపుత్రుడుతో జగన్ ఒక్కడే పోరాడుతున్నాడని చెప్పారు.  ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. 

పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు.. ఇవాళ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్లు విమర్శించే మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Related posts