telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీటీడి పాల‌క మండిలి కీల‌క నిర్ణ‌యం : భారీగా పెరిగిన ఆర్జిత సేవల ధరలు

*తిరుమ‌ల‌లో ఫాస్ట్ పుడ్ సెంట‌ర్ల‌ను తొల‌గించేందుకు నిర్ణ‌యం
*ముగిసిన టీటీడి పాల‌క మండిలి స‌మావేశం
*స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు

*భారీగా పెరిగిన ఆర్జిత సేవల ధరలు
*ఇక‌పై విఐపీల‌తో పాటు అంద‌రికీ ఒక‌ర‌క‌మైన భోజ‌నం..

తిరుమల కొండపై ఇక‌పై ఫాస్ట్ పుడ్ సెంట‌ర్ల‌ను తొల‌గించేందుకు  పాలకమండలి నిర్ణయం తీసుకుంది. గురువారం టీటీడీ పాలకమండలి సమావేశమై.. పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రధానంగా 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ. 3వేల 171 కోట్ల అంచనాగా బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది.

సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రాలంకరణ సేవా టికెట్ ధరను రూ.లక్షకు పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

అంతేకాకుండా ..తిరుమలలో ప్రైవేట్ హోటళ్లను పూర్తిగా తొలగించనున్నట్టుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందజేస్తామని చెప్పారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికి ఒకే రకమైన భోజనం ఉంటుందన్నారు.

తిరుమలలో భోజనాన్ని భక్తులు డబ్బుతో కొనుగోలు చేయొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నిర్ణయం ఒక్కటే కాదు. త్వరలోనే సర్వదర్వనాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

అలాగే.. ఆలయ పనులపై దృష్టి సారించింది. శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడ పనులతో పాటు అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని సమావేశంలో తీర్మానించారు. అదేవిధంగా అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, ఆనంద నిలయాలకు బంగారు తాపడం పనులు చేయించాలని, అన్నమయ్య మార్గం రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు.

టీడీడీ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..

*రూ. 230 కోట్లతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
*రూ. 2.7 కోట్లతో స్విమ్స్ హాస్పిటల్ పూర్తిగా కంప్యూటీకరణ
*ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలకు రూ. 25 కోట్ల కేటాయింపు
*తిరుమలలో అన్నప్రసాదాన్ని మరిన్ని ప్రదేశాలలో అందించేందుకు నిర్ణయం
*నాదనీరాజనం మండపాన్ని శాశ్వత ప్రతిపాదిక నిర్మాణం
*రూ. 3.6 కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ అభివృద్ది

 

Related posts