సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు కొనసాన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. నవశకం సర్వే ద్వారా వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కోటాయించామన్నారు. 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని వివరించారు.
ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపైన చదువుకునే విద్యార్థులకు రూ.20వేల ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇళ్ల పట్టాలపై హక్కు కల్పిస్తూ పేదలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ఇకపోతే మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించామని తెలిపారు.