బ్రిటన్‌కు చెందిన ఖిలాన్ చందరియా (33), ఉషీల పటేల్ (31)లకు ఏప్రిల్ 19న వివాహమైంది. దాంతో ఏప్రిల్ 23న హానీమూన్ కోసం శ్రీలంక వచ్చిందీ కొత్తజంట. గాలేలోని అమరి రిసార్ట్‌లో బస చేశారు. అయితే 25వ తేదీన దంపతులిద్దరూ సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత ఒకేసారి రక్తంతో కూడిన వాంతి చేసుకున్నారు. దీంతో హోటల్ సిబ్బంది హూటాహూటిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఉషీల చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఫూడ్‌పాయిజన్ వల్లే ఇలా జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రస్తుతం చందరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి వివరాలను కోర్టు ముందు ఉంచారు. వివరాలను పరిశీలించిన చీఫ్ మెజిస్ట్రేట్ హర్షన కెకున్వేలా కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించాలని, విచారణను మే 15కు వాయిదా వేశారు. అలాగే చందరియా దేశం విడిచి వెళ్లకుండా అతని పాస్‌పోర్టును కోర్టు తన వద్దే ఉంచుకుంది. కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు ఉషీల మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించకూడదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమె శవాన్ని ప్రస్తుతం కరపిటియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. కొలంబోలోని మూడు లగ్జరీ హోటళ్ళతో పాటు మూడు చర్చిల వద్ద జరిగిన ఈస్టర్ బాంబు దాడులకు సరిగ్గా రెండు రోజుల తరువాత ఈ కొత్తజంట కొలంబోకు రావడం గమనార్హం.