telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

అమరావతికి.. స్టార్ హోటళ్ల శోభ… 7 హోటళ్లకు…

another 7 five star hotels in amaravati

అమరావతిలో ఏకంగా ఏడు ఫైవ్ స్టార్ హోటళ్లకు ఏపీసీఎం చంద్రబాబు భూకేటాయింపు కార్యక్రమాలు పూర్తిచేశారు. మొత్తం ఏడు హోటళ్లతో రాజధాని శోభాయమానంగా వెలుగొందనుంది. అలాగే 448 కోట్లతో ఐటీ పార్క్ ను కూడా ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశం ఆమోదం తెలిపింది. విమానయాన సేవలు, కళాశాలలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లే కొత్త నగరాల భవితవ్యాన్ని నిర్దేశించే వనరులన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో 7 ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు భూకేటాయింపు ధృవీకరణ లేఖలు అందించారు. జీవీ ఎస్టేట్‌ అండ్‌ హోటల్స్‌ (వివెంటా), ఓంశ్రీ భావనసాయి ఎల్‌ఎల్‌పీ (వెస్ట్‌ఇన్‌), సదరన్‌ ట్రావెల్స్‌ (మారియెట్‌), కాంథారి హోటల్స్‌ (ఫార్చ్యూన్‌), అంబికా అగరబత్తీస్‌ అరోమా (రెజెంటా ఇన్‌), స్ప్లెండర్‌ ల్యాండ్‌ బేస్‌ (జింజర్‌), స్వాగత్‌ మోటార్స్‌ (కీస్‌ సెలెక్ట్‌) ఇందులో ఉన్నాయి. దీంతో రాజధానిలో నిర్మాణమయ్యే హోటళ్ల సంఖ్య 16కు చేరింది.

రాజధానిలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌)ను గ్యాస్‌, వాటర్‌, విద్యుత్‌, రోడ్‌, ఫైబర్‌గ్రిడ్‌ తరహాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ (డీసీఎస్‌) ఏర్పాటు అంశంపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఒక ఉన్నతస్థాయి బృందం కొద్దిరోజుల కిందట ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఉన్న దుబాయ్‌ మెట్రోలోను, అబుదాబిలోని ఎతిహాద్‌ టవర్స్‌లోనూ ఈ వ్యవస్థను ఇప్పటికే వీరు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 40 వేల టన్నుల సామర్థ్యంతో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న డీసీఎస్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థగా నిలుస్తుందని చెప్పారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి తెలిపారు.

అలాగే, రూ.448 కోట్లతో రాజధాని గ్రామమైన వెంకటపాలెం సమీపంలో ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 1,41,000 చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాతో చేపట్టే ఐటీ పార్కులో 10 లక్షల చదరపు అడుగుల వరకు ఆఫీసు స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఇందులో సగ భాగం వాణిజ్యపరమైన కేటాయింపులకు పోను, మిగిలిన సగభాగాన్ని దిగ్గజ సంస్థల కోసం అందుబాటులో ఉంచుతామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ కోసం ఫోస్టర్‌ ఫ్లస్‌ పార్టనర్స్‌ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. హ్యాపీనెస్ట్‌ సిరీస్‌లో భాగంగా రెండో ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రతిపాదనపై సమావేశం ఆమోదం తెలిపింది. ఐనవోలు దగ్గర మొత్తం 1704 ప్లాట్లు, 12 బ్లాకులుగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. నిర్మాణ రంగానికి రాజధానిలో 150 ఎకరాల్లో నగర నిర్మాణాన్ని చేపట్టేందుకు సమావేశంలో ప్రాథమిక అనుమతి లభించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ్‌షచంద్ర, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి పాల్గొన్నారు.

Related posts