కేరళను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో అక్కడి ప్రజలు బురద, చెత్తతో నిండిపోయిన తమ నివాసాలను శుభ్రం చేసుకొనేందుకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని దృశ్యాలు మత సామరస్యతను చాటి చెబుతున్నాయి. వరదల కారణంగా కేరళ వయనాడ్‌లోని సుల్తాన్‌బాత్రే ప్రాంతంలో ఉన్న శ్రీరామ మందిరం పూర్తిగా నీటితో నిండిపోయింది. వరదనీరు తగ్గుముఖం పట్టాక ఆ ప్రదేశమంతా చెత్తతో నిండిపోయింది. ఆ మందిర పరిసరాలను శుభ్రం చేసేందుకు గానూ ముస్లిం యూత్ లీగ్‌కు చెందిన కొందరు వాలంటీర్లు ముందుకు వచ్చారు.
ఈ వాలంటీర్లు పూర్తిగా ఒకరోజు శ్రమించిమరీ మందిరాన్ని శుభ్రం చేశారు. అలాగే ఉత్తర కేరళలోని కన్నూరు ప్రాంతంలోని కురుమాతుర్ జుమా మసీదులో భారీవర్షాల వల్ల చెత్త పేరుకుపోయింది. పైగా తెల్లవారితే బక్రీద్ వేడుక. దీంతో సంతోష్, కుమార్ అనే ఇద్దరు యువకులు మరికొందరిని కలుపుకొని అదివారం మసీదును శుభ్రం చేశారు. దీంతో సోమవారం ఉదయం బక్రీద్ పార్థనలు చేసేందుకు ఆ మసీదులో ఏ ఇబ్బంది కలగలేదు. ఈ రెండు ఘటనలు కూడా లౌకికవాద భావాలు మనదేశ ప్రజలలో ఎంత బలంగా ఉంటాయో ప్రపంచానికి నిరూపించాయి.