telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌నే వారం త‌ర్వాత వ‌చ్చా..సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తాం

*అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వరద బాధితులందరికీ అండగా ఉంటాం 
*ప్రజలకు మంచి చేయాలంటే అందుకోసం డ్రామాలు ఆడక్కర్లేదు
* ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌నే వారం త‌ర్వాత వ‌చ్చా..

వరద బాధితులందరికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది.

అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న ఆయన.. బాధితులతో నేరుగా మాట్లాడారు.. ప్రజలకు మంచి జరగాలంటే అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరుగులు పెట్టించాలన్నారు. అప్పుడే సహాయ కార్యక్రమాలు వేగంగా జరుగుతాయన్నారు. తాను వారం రోజుల తర్వాత వస్తానని, అందరూ తమకు సాయం అందిందని చెప్పాలని తాను అధికారులను ఆదేశించాన‌ని అన్నారు.

వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లని.. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చాన‌ని, మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు.పంట, ఆస్తి నష్టం అంచనాలు పూర్తయిన వెంటనే పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తామని తెలిపారు.

అధికారులకు సరైన వనరులు అందిస్తే వారు తమ పని తాము చేసుకుంటారని చెప్పారు. వారం రోజుల తర్వాత తాను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నానని తెలిపారు. ఏ ఒక్కరికీ సాయం అందకపోయినా అంగీకరించనని చెప్పారు.

ముఖ్యమంత్రి అంటే ఆ విధంగా చేయాలని, వరదలప్పుడు వచ్చి డ్రామాలు చేయడం తనకు చేతకాదని జగన్ అన్నారు. డ్రామాలను పక్కన పెట్టి సాయం అందడంపైనే దృష్టి పెట్టామని, ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకోగలిగామని జగన్ అన్నారు

అంతేకాదు జి. పేదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీజన్‌ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

మ‌రోవైపు వర్షంలోనూ సీఎం జగన్‌ ఆగకుండా తన పర్యటనను కొనసాగిస్తుండడం విశేషం. బాధితులందరికీ సాయం ఎలా అందుతోంది?.. అధికారులు, వలంటీర్ల పని తీరుపై స్వయంగా ఆయనే అడిగి తెలుసుకుంటూ కాలినడకనే ముందుకెళ్తున్నారు

Related posts