ఎన్నికల లెక్కింపు దగ్గర పడుతుంది. ఆ రోజుకు ఎటువంటి గొడవలు జరుగకుండా ఈసీ అనునిత్యం శాంతిభద్రతలపై ఒక కన్ను వేసే ఉంచుతుంది. అయినా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ పరిధిలోని యాటపేట గ్రామంలోని ఓ ఇంట్లో నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాటపేటలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు అద్దెకు నివాసముంటున్నారు.
ఈ బాంబులు అడవి పందులను వేటాడేందుకు వారు తయారు చేస్తుండగా, ఒక్కసారిగా అవి పేలాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. దీనిబట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.