telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

600వ రోజులకు చేరిన అమరావతి రైతుల ఉద్యమం

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ చేస్తున్న రైతుల ఉద్యమం 600 రోజులకు చేరుకుంది. ఈ సందర్బంగా అమరావతి జేఏసీ నేతలు న్యాయస్థానం టు దేవస్థానం భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి టీడీపీ సహా పలుపార్టీలు మద్దతు తెలిపాయి. అయితే రాజధాని రైతుల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పలువురు టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో రాజధాని అమరావతిలో ఇవాళ టెన్షన్ వాతావరణం నెలకొంది. మీడియాను సైతం రాజధాని గ్రామాల్లోకి అనుమతించలేదు. అమరావతి జేఏసీ నేతలు, రైతులు, మహిళా నేతలు రోడ్డుపైకి ఆందోళనకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులతో వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు జేఏసీ నేతలు, మహిళా నేతలను అరెస్టు చేశారు.

అమరావతిలో మహిళా జేఏసీ నేతలను అరెస్టు చేయడంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. అమరావతి ఆడపడుచులను చూస్తే జగన్ రెడ్డికి అంత ఉలుకెందుకని ప్రశ్నించారు. మహిళపై అక్రమ కేసులు, అరెస్టులు సిగ్గనిపించటం లేదా అని దుయ్యబట్టారు.
రాజధాని మహిళా రైతులపై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామన్నారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించి అరెస్ట్ చేయటం దుర్మార్గం అన్నారు. అమరావతి ఆడపడుచులను చూసి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? మహిళలు అని చూడకుండా కేసులు పెట్టడం,పోలీసులతో గొడ్లను బాదినట్లు బాధించడం,మహిళలను జుట్టు పట్టి ఈడుస్తూ పోలీసు వాహనాల్లో కుక్కడం, బూటు కాళ్లతో తన్నించడం, చున్నీలతో మహిళల గొంతు బిగించడం, మెడలో మంగళ సూత్రాలు లాగేయడం, గోళ్ళతో రక్కడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.

600 రోజులుగా పోరాడుతున్న అమరావతి రైతులపై ఈ విధంగా వికృతంగా వ్యవహరించి పైశాచిక ఆనందంపొందుతున్నారని మండిపడ్డారు. రాష్ర్ర్టం కోసం భూములివ్వటమే వారు చేసిన తప్పా? మహిళలు శాంతి యుతంగా ఉద్యమం చేస్తుంటే ఉక్కు పాదం మోపుతారా ? భవిష్యత్ కోసం పోరాడుతున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే జగన్ రెడ్డి మహిళలకు ఇచ్చే గౌరవమా? అని ప్రశ్నించారు. ఎందుకు మహిళలను అంతలా వేధిస్తున్నారు, హక్కుల కోసం పోరాడటం నేరమా? మగ పోలీసులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను అరెస్టు చేసేటప్పుడు మహిళా పోలీసులతో మాత్రమే చేయించాలి. మహిళలను సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచరాదు అనే నిబంధన కూడా మీ నియంత ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. అధికారపార్టీ నేతల దన్నుతో పోలీసులు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. చట్టం రాజ్యాంగాలను ఉల్లంఘించి హద్దుమీరి ప్రవర్తిస్తున్న పోలీసులపై భవిష్యత్ లో చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాలు తెచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. మహిళలంటే గౌరవం లేకుండా వ్యహరిస్తూ మహిళలను కించపరుస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు. అమరావతి రైతులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతమందిని అరెస్ట్ చేసినా అమరావతి ఉద్యమం అణచివేయటం అసాధ్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అమరావతి మహిళలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేసి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మహిళల చేతిలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.

Related posts