దేశంలో ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు దేశ ప్రజలకు హిందీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ లో స్పందించారు. భిన్నభాషలు, యాసలు ఉండటం మనదేశపు బలం. కానీ మన దేశంలో ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే విదేశీ భాషలకు చోటుండదు. అందుకే మన స్వాతంత్ర్య సమరయోధులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారు అని ట్వీట్ చేశారు.
ప్రపంచానికి భారత్ తరఫున హిందీ ప్రాతినిధ్యం వహిస్తుందని షా అన్నారు. హిందీ వల్లే దేశం ఐక్యంగా ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. కాబట్టి భారతీయులంతా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలను నిజం చేసేందుకు హిందీ భాష వాడకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. మరోవైపు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.