తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మిడియట్ విద్యాశాఖ మొదటి సంవత్సరం విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షల ఫలితాల్లో తప్పిన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఇంటర్మిడియట్ బోర్డు నిర్వాకంతో తప్పిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంది. విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

