telugu navyamedia
సామాజిక

హిందూ సునామీ సృష్టిస్తా..

సంపద ఉన్నోడికే దేవుడంటే కుదరదు… సామాన్యులకు అందుబాటులో ఉండాలని పాలకులకు కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందస్వామి గట్టిగా హెచ్చరించారు. కోటీశ్వరులకే వెంకన్న సేవలను అందుబాటులో ఉంచే ప్రయత్నాలు మానుకోకుంటే తాడేపల్లికి పాదయాత్ర చేపట్టి సెగపుట్టిస్తామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధార్మిక సంస్థలో పాలకులపెత్తనం విపరీత ధోరణులకు దారితీస్తోందని ఆయన విచారం వ్యక్తంచేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని స్వామీజీ మండిపడ్డారు.

సాధువు మాటలను పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ లో హిందూ సునామీ సృష్ణిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనతీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని శ్రీపీఠం అధిపతి ఆగ్రహించారు. కరోనా మహమ్మారి విస్తరించిన నేపథ్యంలో హిందువుల పండుగలపై ఆంక్షలు విధించిన సర్కారు… కరోనాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్… ప్రపంచదేశాలను వణుకుపుట్టిస్తుంటే… ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏంచేస్తోందని మండిపడ్డారు.

పొరుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో ముందస్తు జాగ్రత్తలను పాటించి క్రిస్మస్, కొత్త సంవత్సరాది వేడుకలను రద్దుచేశాయనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రజాప్రభుత్వం అన్ని మతాలవారిని సమానంగా చూడాలి… కొత్త వేరియంట్ ప్రభలుతున్న తరుణంలో ప్రభుత్వానికి ఉదాసీన వైఖరి మంచిది కాదని సూచించారు.

మెజారిటీ జనం ఒక కోటి 40 లక్షమంది హిందువుల మద్దుతు ఇస్తేనే సర్కారు ఏర్పాటుచేసుకోగలిగారనే విషయాన్ని పాలకులు గమనించాలని పేర్కొన్నారు.హిందువుల ఆలయాలను ఇష్టారాజ్యంగా ధ్వంసంచేస్తుంటే… బాధ్యతగల దేవాదాయశాఖ మంత్రి ఏంచేశారని స్వామి పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో పథకం ప్రకారం దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తంచేశారు.

అంతర్వేది రథం తగులపెడితే… గుడ్డలు ఊడదీయాల్సిన పాలకులు…నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరించారని ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఉత్తర ప్రదేశ్ లో జరిగితే… యోగి ఆదిత్యానాథ్… ఆస్తుల్ని జప్తుచేస్తున్నారని గుర్తుచేశారు.

పవిత్రక్షేత్రం రామతీర్థంలో దేవుడి తల తొలగిస్తే చూసీచూడనట్లు వ్యవహరించడమేంటని స్వామీజీ ప్రశ్నించారు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపం తొలగించిన నేపథ్యంలో చిన్నజీయర్ స్వామి సమక్షంలో పునరుద్దరిస్తామని చెప్పి… ఇప్పటిదాకా ఏంచేశారని పరిపూర్ణానంద జగన్ సర్కారును నిలదీశారు. తిరుమలలో విలువైన పింక్ డైమండ్ గురించి పట్టించుకోరు, స్వామి వారి కైంకర్యాల నిర్వహణలో మీరాశీ వ్యవస్థలో వ్యక్తుల్ని ఉద్యోగులుగా మార్చడమేంటి? అడుగులకు మడుగులొత్తుతూ కూర్చోవాలా? అంటూ ధ్వజమెత్తారు.

ప్రభుత్వంలో పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే… హిందువులు సహనంతోనూ… ఓపికతో ఉంటే…. గొర్రెలనే భావనలోంచి పాలకులు బయటకు రావాలనన్నారు.
తిరుమల వెంకటేశ్వరస్వామికి జన్మనిచ్చిన తల్లి వకుళా మాత మందిరంకోసం ఉద్యమిస్తే… చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించి ముందుకొచ్చారు.

పేరూరు సమీపంలో వకుళామాత ఆలయాన్ని గొప్పగా నిర్మించడంపట్ల మనసా వాఛా కర్మణా అభినందించారు. దేవుడిపేరుతోనూ… సేవల పేరుతూనూ వసూలు చేసి… సామాజిక
కార్యక్రమాలు చేపట్టమని ఆగమశాస్త్రంలో ఎక్కడా లేదన్నారు. శ్రీవారి సేవను కోటిరూపాయలకు పెంచి… ఆస్పత్రులను నిర్మించడాన్ని స్వామీజీ తప్పుబట్టారు.

గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని స్వామి పరిపూర్ణానంద స్వామి డిమాండ్ చేశారు. గోవధను ఆపాల్సిన ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడులను ప్రోత్సహించడం ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. కర్ణాటక తరహాలో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టంతీసుకురావాలని స్వామీజీ డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని స్వామీజీ మండిపడ్డారు.
విజయవాడలో పగలగొట్టిన గుళ్ళను ఎప్పుడు పునర్నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

పాలకుల్లో మార్పు రాని పక్షంలో…. ఆంధ్రప్రదేశ్లో గడప గడపకు తిరిగి పాలకుల అరాచకాలు బయట పెడతామన్నారు. హిందూ వ్యతిరేక శక్తుల పట్ల కనికరం చూపించకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు. సాధువు మాటలను పెడచెవిన పెడితే ఆంధ్రరాష్ట్రంలో హిందూ సునామీని
సృష్టిస్తామన్నారు. క్రిస్మస్ రోజునే సర్కారు సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు.

Related posts