telugu navyamedia
తెలంగాణ వార్తలు

బొమ్మలరామారంలో ఎయిమ్స్ వైద్యసేవలు..

పల్లెల్లో అనారోగ్యానికి గురైన ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామాన్ని బీబీనగర్ ఎయిమ్స్ దత్తత తీసుకుంది. మెరుగైన వైద్యసేవలు అందిస్తూ మన్ననలను పొందుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతమైన బొమ్మలరామారంలో ఎంతోమంది వలస కార్మికులు, వ్యవసాయ కూలీలున్నారు. వాళ్లవి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు.

ఎవరైనా అనారోగ్యానికి గురైనపుడు ఖరీదైన వైద్యం చేయించుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో బీబీనగర్ ఎయిమ్స్ బొమ్మలరామారం గ్రామానికి వెళ్లి స్పెషలిస్ట్ వైద్యులతో పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీచేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, ఆధునిక వైద్యాన్ని అందించేందుకు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా తీసుకున్న నిర్ణయం పేద కుటుంబాల్లో ఆనందం నింపుతోంది. దివిస్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు రెండు లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా అందించడంతో బొమ్మలరామారం గ్రామానికి చెందిన ఎంతో మందికి వైద్యంతో పాటు ఉచితంగా మందులు అందించగలిగారు.

ఎముకల వ్యాధి నిపుణులు, బీపీ ,షుగరు, ఫ్యామిలీ మెడిసిన్ ,పిల్లల వైద్యులు, కంటి వైద్యులు అందుబాటులో ఉండి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. బొమ్మలరామారం చుట్టుపక్కల గ్రామాల లోని గిరిజన తండాల్లో గ్రామస్తులు వృద్ధులు ఈ వైద్య సౌకర్యం వినియోగించుకుంటున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ బాటియా చేతుల మీదుగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు ఎయిమ్స్ సూపరింటిండెంట్ డాక్టర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణప్రాంతాల్లోని పేదలు పట్టణ ప్రాంతమెళ్లి వైద్యం చేయించుకోడానికి ఇబ్బంది పడుతారని, సామాజిక బాధ్యతతో తామే గ్రామాలకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

Related posts