telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు..

ప్రపంచదేశాల్లో ప్రకంపనలు సృష్టించిన ఒమిక్రాన్ తెలంగాణలోనూ వణుకు పుట్టిస్తోంది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసుల్ని గుర్తించామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఒమిక్రాన్ నిర్థారణ అయిన ఇద్దరినీ… తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామన్నారు. ఒమిక్రాన్ పట్ల ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని విన్నవించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు. సోమాలియానుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించి జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఒమిక్రాన్ గా నిర్థారణ అయిందని పేర్కొన్నారు.

హైదరాబాద్ కు ల్యాండ్ అయిన తర్వాత బెంగాల్ కు వెళ్లిన మరో యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కెన్యానుంచి వచ్చిన యువతికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇద్దరూ వేర్వేరుగా వచ్చిన వ్యక్తులైనప్పటికీ… మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన వారని ప్రాథమికంగా గుర్తించామన్నారు. గత రాత్రి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్థారణకొచ్చాయని శ్రీనివాస్ వివరించారు. ఒమిక్రాన్ నిర్థారణ అయిన వ్యక్తులు కలసి మాట్లాడినవారిని గుర్తించి పరీక్షలు నిర్వహించామన్నారు.

వ్యక్తిగత జాగ్రత్త అవసరం :-

ఎవరైనా ఇళ్లనుంచి బయటకొచ్చే సమయంలో వ్యక్తిగత భద్రతకోసం జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. ఇల్లొదిలి బయటకొచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కుతో రావాలని కోరారు. జనసమ్మర్థంగా ఉన్న ప్రాంతాలను సందర్శించకుండా కాస్తాదూరాన్ని పాటిస్తే మంచిదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నామని ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన కేసు చాలానే ఉన్నాయన్నారు.

Related posts