telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

రైతులు కూడా ఎన్నో ఇన్నోవేషన్లు చేస్తున్నారు: కేటీఆర్

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోవున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను మంత్రి కేటీఆర్‌, నాబార్డ్ ఛైర్మన్‌ గోవిందరాజులు కలిసి ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్‌ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏడేళ్లలో తెలంగాణ వ్య‌వ‌సాయ‌ం, సాగునీటి రంగంలో ఏ రాష్ట్రం సాధించ‌ని అద్భుతమైన విజ‌యాల‌ను సాధించిందన్నారు. ఇవాళ తెలంగాణ విత్తన భాండాగారంగా మారింద‌న్నారు. ఒక‌ప్పుడు దేశంలో ఆహార భ‌ద్ర‌త స‌వాల్‌గా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆహార భద్రతపై కాదు ప్రజలంతా న్యూట్రిషన్ ఫుడ్ పై దృష్టి సారిస్తున్నారు అన్నారు. రైతుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా ఆదుకుంటుందని, వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మేనని అన్నారు. స‌బ్సిడీపై నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు.

రైతును మించిన ఇన్నోవేటర్ లేడని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇన్నోవేషన్ ఎవరి సొత్తూ కాదని, ఎవరు ఏ కొత్త పరికరం కనిపెట్టినా ప్రోత్సహించాలని అన్నారు. రైతులు కూడా ఎన్నో ఇన్నోవేషన్లు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయరంగంలో ఇన్నొవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకే అగ్రిహబ్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Related posts