telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: సౌందరరాజన్

రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపింది. పరిరక్షణ ఉద్యమ వ్యవస్థాపకుడు, రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ తన కుమారుడిపై జరిగిన విచక్షణారహిత దాడిని తీవ్రంగా ఖండించారు.

ఇంట్లోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రంగరాజన్‌పై దాడి చేసి గాయపరిచిన ఘటనలో తగిన చర్యలు తీసుకోవాలని సౌందరరాజన్ ఒక పత్రికా ప్రకటనలో పోలీసు శాఖను అభ్యర్థించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలయ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రంగరాజన్‌పై దాడి చేసిన వారు రామరాజ్యం అనే సంస్థకు చెందినవారని, తమ సంస్థలో చేరిన తర్వాత ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని రంగరాజన్‌ను బెదిరించారని ఆయన ఆరోపించారు.

అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజులుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును చేధించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు.

మరోవైపు రంగరాజన్‌పై జరిగిన దాడిని హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. రంగరాజన్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts