చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
దురదృష్టకరమైన ఘటన ఇదని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలని అన్నారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు, పోరాటం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని చెప్పారు.
ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారని తెలిపారు.
‘‘టెంపుల్ మూమెంట్ ’’ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో రంగరాజన్ తెలిపారని అన్నారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారని చెప్పారు.
రంగరాజన్ పై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలని అన్నారు. చిలుకూరు వెళ్లి రంగరాజన్ ని పరామర్శించి, అండగా ఉండాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి ఆదేశించారు. ఈ మేరకు రంగరాజన్ కు భరోసా ఇవ్వాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.