telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ మీడియా సమావేశం “మంటెత్తి పోయింది”

NTR
ఇప్పుడు పద్మశ్రీ, నటరత్న ఎన్.టి. రామారావు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. 
ఆయన జీవితంపై ఇప్పటికే “ఎన్టీఆర్ కథానాయకుడు”, “ఎన్టీఆర్ మహానాయకుడు “సినిమాలు వచ్చాయి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” విడుదలకు సిద్ధంగా వుంది. జగదీశ్వర రెడ్డి దర్శకతం వహించే “లక్ష్మీస్ వీరగ్రంధం” నిర్మాణంలో వుంది. 
ఈ సందర్భంలో రామారావు గారి గురించి ఓ సంఘటన. 
ఇది 37 సంవత్సరాల నాటి సంగతి. సరిగ్గా ఇదే రోజు 21 మార్చి 1982 వ సంవత్సరం ఆరోజు ఆదివారం. 
అప్పటికే మహానటుడు ఎన్.టి రామారావు జాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్స్ లో వున్న రామ కృష్ణ స్టూడియోస్ రాజకీయ నాయకులు, సినిమా వారితో సందడిగా వుంది. ఆరోజు నేను ఆఫీసుకు వెళ్ళగానే సాయంత్రం ఎన్టీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని  చెప్పారు. 
నేనప్పుడు ఆంధ్ర జ్యోతి వారి జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక కు హైద్రాబాద్లో రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. 
అప్పటికే నాకు రామారావు గారితో పరిచయం వుంది. రామారావు గారు రాజకీయాల్లో వస్తున్నామని చెప్పారు కాబట్టి  ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కు ఆంధ్ర జ్యోతి దిన పత్రిక నుంచి కూడా ఓ రిపోర్టర్ వస్తాడని అనుకున్నాను. అయితే ఆ ప్రెస్  కాన్ఫరెన్స్ కు బ్యూరో చీఫ్ ఐ.వెంకట రావు గారు వస్తానని చెప్పారు. 
ప్రెస్ కాన్ఫరెన్స్ 6.30 గంటలకు. మేము 5 గంటలకే బయలుదేరాము. నేను వెంకట రావు గారి స్కూటర్ మీద వెళ్లాను. మా వెనుక ఫోటోగ్రాఫర్ అతని బండి మీద వచ్చాడు. 
మేము 6.00 గంటలకు స్టూడియోస్ కు వెళ్ళాము. ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రామారావు గారు తన కార్యాలయం లో వున్నారని చెప్పారు. 
Rama Rao
రామకృష్ణ స్టూడియోస్ లోపలకు వెళ్ళగానే కుడు చేతి ప్రక్కన స్టూడియోస్ కార్యాలయం ఉండేది. క్రింద టెలిఫోన్ ఆపరేటర్, ఎవరైనా అతిధులు వస్తే కూర్చోవడానికి నాలుగు కుర్చీలు ఉండేవి. రామారావు గారు మేడ మీద గదిలో  కూర్చుండేవారు. పెద్ద టేబుల్ వెనుక పెద్ద సింహం విగ్రహం ఉండేవి. 
రామారావు గారు జర్నలిస్టులకు అక్కడే ఇంటర్వ్యూ లు ఇచ్చేవారు. 
“రామారావు గారిని కలుద్దామా ?” అని వెంకటరావు గారితో అన్నాను. 
“వద్దులెండి క్రిందకు వస్తారుగా” అన్నారు. అప్పటికే హైద్రాబాద్లో వున్నా వివిధ పత్రికల నుంచి చీఫ్ రిపోర్టర్ లు వచ్చారు. 
రామారావు ప్రెస్ కాన్ఫరెన్స్ అనగానే అందరిలో ఆసక్తి, అందుకే బ్యూరో చీఫ్ లు, చీఫ్ రిపోర్టర్ లు వచ్చారు. సరిగ్గా 6.20 కల్లా రామారావు గారు పంచె, లాల్చీ తో తెలుగు తనం వుట్టిపడేవా వున్నారు. 
క్రిందకు వచ్చారు. అందరు ఆయనతో షేక్ హ్యాండ్ కోసం ముందుకొచ్చారు. 
నన్ను చూడంగానే చిరునవ్వు తో “బ్రదర్ బాగున్నారా” అని పలకరించారు. 
నేను ఐ. వెంకటరావు గారిని పరిచయం చేశాను. 
ఆరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో జర్నలిస్టు మిత్రులకు కోసం రామారావు గారు పచ్చిమిరపకాయల బజ్జీలు, అందులోకి మామిడికాయ పచ్చడి తెప్పించారు. 
ఆ కాంబినేషన్ చూడగానే చాలామంది ఆశ్చర్య పోయారు. అవి తింటుంటే చాలామందికి కళ్ళమ్మట నీళ్లు కారాయి. మరి కొంతమంది మంది ఆ మంటకు తట్టుకోలేక నీళ్లు తాగారు. “ఏమండి అర్భకులు…” అంటూ రామారావు గారు ఆప్యాయంగా తింటుంటే జర్నలిస్టులు ఆయనవైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయారు. 
ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. 
ఆ తరువాత మార్చి 29న తెలుగుదేశం పార్టీని అధికారికంగా ప్రకటించారు. 
-భగీరథ 

Related posts