భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి ప్రపంచకప్- 2019లో తాము కోరుకున్న ఆటగాళ్లను ఎంపిక చేయలేదని క్రికెట్ సలహా కమిటీకి చెప్పినట్టు సమాచారం. ఇకనైనా సెలక్షన్ ప్రక్రియలో కోచ్ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. జట్టు యాజమాన్యానికి ఓటు హక్కు సైతం లేదని ఆయన వాపోయారట. కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రిని శుక్రవారం కోచ్‌గా ప్రకటించింది. ఈ మధ్యే ముగిసిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో ఎందుకు ఓటమి పాలైందని కమిటీ సభ్యులు ఆయన్ను ప్రశ్నించారు.
ప్రపంచకప్ జట్టులో తాను కోరుకున్న ఆటగాళ్లు లేరని శాస్త్రి చెప్పారు. సెలక్షన్ ప్రక్రియలో తమ పాత్రేమీ లేదని వాపోయారు. ఇకనైనా తమను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ‘జట్టును ఎంపిక సమావేశాల్లో సెలక్టర్లతో కెప్టెన్ కోహ్లీ మాత్రమే కూర్చుంటున్నారు. కోచ్ అయిన తనను పక్కన పెట్టేయడం శాస్త్రికి నచ్చలేదు. ప్రపంచకప్‌లో మిడిలార్డర్లో ఆడేందుకు జట్టు యాజమాన్యానికి తాను సూచించిన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. సెలక్షన్ సమావేశాల్లో జట్టు యాజమాన్యానికి ఓటు లేకపోవడంపైనా పెదవి విరిచారు. ఆటగాళ్లను ఎంపిక చేసేటప్పుడు కోచ్, కెప్టెన్ సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని శాస్త్రి నొక్కిచెప్పారు’ అని క్రికెట్ సలహా కమిటీ సభ్యుడొకరు మీడియాకు వెల్లడించారు.

