కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే అక్కడ ఆంక్షలను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు ఈ రోజు యురోపియన్ యూనియన్‌కు చెందిన ఎంపీలు వచ్చారు. ఈయూ బృందం రాకపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. ఇస్లామోఫోబియా నుంచి ఇబ్బందిపడే ఈయూ నేతలు కశ్మీర్ లోయకు ఎందుకు వచ్చారన్న విషయాన్ని ఆయన తన ట్వీట్‌లో ప్రశ్నించారు.
నాజీ ప్రేమికులు.. కశ్మీర్ లోయలో ఉండే ముస్లిం ప్రాంతాలకు వెళ్తున్నారని ఉర్దూ భాషలో ఓ ట్వీట్ చేశారు. గైరోంపే కరమ్ అప్నోంపే సితమ్ అన్న భావాన్ని కూడా ఆయన వినిపించారు. కశ్మీర్ లోయకు ఈయూ నేతలను తీసుకురావడం పట్ల ఇతర పార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా ఎంపీల రాకను ప్రశ్నించారు. బయటి దేశాల ఎంపీలు కశ్మీర్‌కు వస్తుంటే, స్థానిక ఎంపీలను మాత్రం వెళ్లనివ్వడం లేదని ప్రియాంకా ట్వీట్ చేశారు.