రాష్ట్రంలో వైద్య విద్య ప్రమాణాల పెంపు, పరిశోధనలకు పెద్దపీట వేస్తూ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
మెడికల్ కాలేజీల పనితీరుపై ఎంసీఎంసీ (MCMC) కమిటీలు ఇకపై ప్రతి నెలా నివేదికలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ‘స్పోకెన్ ఇంగ్లీష్’లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు
ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడంతో పాటు, ఇందు కోసం ప్రత్యేక టీచర్ల నియామకానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా పెంచాలని ఆదేశించారు.
అలాగే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మెడికోల ఆత్మహత్యల నివారణకు కాలేజీల్లో సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
పెరిగిన కాలేజీలకు అనుగుణంగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ పటిష్టం చేయడంతో పాటు సిబ్బంది పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అంతేకాకుండా హెల్త్ యూనివర్సిటీ సేవలను వేగవంతం చేసేలా కార్యకలాపాలన్నీ పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు.
అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, స్కిల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచనలు చేశారు.


ఏపీలో విద్యుత్ కోతలు.. ప్రభుత్వంపై పవన్ చురకలు!