కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైభవంగా వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటోంది.
ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ మేరకు దేశ రాజధానిలో ఆమెతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు.
ఇవే ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించబోతోంది.
దీనికోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. లోగోతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్నీ విడుదల చేస్తారు అదే రోజున.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
ఈ క్రమంలోనే అధికారిక చిహ్నానికి సంబంధించిన మూడు రకాల లోగోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనంటూ.. ఆ మూడు లోగోల ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఫొటోల్లో మొదటి లోగో మధ్యలో పూర్ణకుంభం.. పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్ బొమ్మ ఉంది. పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు కూడా ఉన్నాయి.
రెండో లోగోలో పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, మధ్యలో తెలంగాణ మ్యాప్, కింది భాగంలో హుస్సేస్ సాగర్‌లోని బొమ్మ కనిపిస్తోంది.
మూడో లోగోలోనూ.. పైభాగంలో మూడు సింహాల చిహ్నం ఉండగా.. మధ్యలో వెలుగుతున్న సూర్యున్ని తలపించేలా ఓ గుర్తు ఉండి.. దాని చూట్టూ నీటి బిందువుల ఆకారాలు విస్తరించి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మూడు చిహ్నాల్లో నాలుగు భాషల్లో (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దు) తెలంగాణ పేరు కనిపిస్తోంది.