హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పెద్దలను కాదని ప్రేమించి మతాంతర వివాహం చేసుకుందని.. యువతి కుటుంబసభ్యులు ఆమె భర్తపై నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు. తన కళ్లెదుటే భర్త కుప్పకూలడంతో గుండెలు బద్ధలయ్యేలా రోదించింది.
వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరైనప్పటికీ.. ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం. ఏడేళ్లుగా వీరిప్రేమాయణం సాగుతోంది. ఇంట్లో దీని గురించి తెలియడంతో ఆశ్రిన్ కుటుంబ సభ్యులు నాగరాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ కుమార్తెను వదిలిపెట్టాలని హెచ్చరించారు.
ఆశ్రిన్‌ను పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్న నాగరాజు.. హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతంలో ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్దినెలల కిందట సేల్స్‌మన్‌గా చేరాడు. కొత్త సంవత్సరం రోజు ఆశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకుందామని చెప్పాడు.
ఈ క్రమంలోనే జనవరి చివరి వారంలో ఆశ్రిన్ ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత లాల్ దర్వాజ ఆర్యసమాజ్‌లో జనవరి 31న వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.ఆశ్రిన్ ఇంటి నుంచి ముప్పు ఉంటుందని నాగరాజుకు తెలుసు. అందుకే తమను ఎవరూ గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు. వీరిద్దరు హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో.. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లిపోయారు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నారు. తమ కోసం ఎవరూ వెతకడం లేదని నిర్ధారించుకున్న తర్వాత.. ఐదు రోజు క్రితం హైదరాబాద్‌కు వచ్చారు.
సరూర్ నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరు హైదరాబాద్‌కు వచ్చిన విషయం ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇద్దరి కదలికలను గుర్తించి.. మాటువేశారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్ ఇంటి నుంచి బయటకు వచ్చారు.బైక్‌పై వెళ్తుండగా జీహెచ్ఎంసీ రోడ్డు ప్రాంతంలో ఆశ్రిన్ సోదరుడు, అతడి స్నేహితుడు వారిని అడ్డుకున్నాడు. అనంతరం గడ్డపారతో దాడి చేసి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో నాగరాజు స్పాట్‌లోనే మరణించాడు.
హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి ఆశ్రిన్ సోదరుడు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య మతాంతర వివాహమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.