telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్ ను నిలదీసిన నారా లోకేష్..‘ఘాటు’ లేఖ

పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు కోసం మీ ప్రభుత్వంపై నిర‌స‌న తెలిపిన టీచర్లను వేధించేందుకు టెన్త్ ప‌రీక్షల్ని వాడుకుంటున్నార‌నే అనుమానాలున్నాయని సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిల‌దీశారు

10వ త‌ర‌గ‌తి పరీక్షలు మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ప్రతిరోజు పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ వంటి ఘటనలు వెలుగుచూస్తూనే వున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో 40మందికి పైగా టీచర్లు అరెస్టయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.

ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ కు లోకేష్ ఘాటు లేఖ రాశారు. ముఖ్య‌మంత్రి గారూ! మీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా నిర్వ‌హిస్తున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణా వైఫ‌ల్యంతో పూర్తిగా అభాసుపాల‌య్యాయి. సీఎం అయి మూడేళ్ల‌యినా క‌రోనా కార‌ణంగా రెండేళ్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గలేదు. ఎట్ట‌కేల‌కు మీ పాల‌నా యంత్రాంగం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లు మ‌న దేశంలోని ప‌రీక్ష‌ల చ‌రిత్ర‌లోనే చీక‌టి అధ్యాయంగా నిలిచాయి. రోజుకొక చోట పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, ఒక‌రి బ‌దులు ఒక‌రు ప‌రీక్ష‌లు రాయించ‌డం, లీకైన ప్ర‌శ్న‌ప‌త్రాల‌కి జ‌వాబులు రాయించి జ‌త‌ చేయ‌డం వంటివ‌న్నీ జ‌రిగాయి. ప్ర‌తిభ‌కి కొల‌మానంగా నిల‌వాల్సిన ప‌రీక్ష‌లు అక్ర‌మాల విక్ర‌మార్కులకి వ‌రం అయ్యాయి. చాలా చోట్ల పేప‌ర్ లీకై, వైసీపీ వాట్స‌ప్ గ్రూపుల్లో ప్ర‌శ్నాప‌త్రాలు ప్ర‌త్య‌క్షం అవడం వైసీపీ నాయ‌కుల పిల్ల‌ల‌కి మెరుగైన మార్కుల కోసం బ‌రితెగించార‌ని స్ప‌ష్టం చేస్తోంది. మ‌రోవైపు పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు కోసం మీ ప్ర‌భుత్వంపై నిర‌స‌న గ‌ళం వినిపించిన ఉపాధ్యాయుల‌పై క‌క్ష పెట్టుకుని మ‌రీ వేధించేందుకు టెన్త్ ప‌రీక్ష‌ల్ని వాడుకుంటున్నార‌నే అనుమానాలున్నాయి.

టీచ‌ర్ల‌కి టెన్త్ ఫ‌లితాలు టార్గెట్లు పెట్టి, మ‌రోవైపు పేప‌ర్‌లీక్ ల‌కి బాధ్యుల్ని చేస్తూ స‌స్పెండ్ చేయ‌డమే దీనిని స్ప‌ష్టం చేస్తోంద‌ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యంపై ప్ర‌భుత్వం స్పంద‌న చాలా హాస్యాస్ప‌దంగా ఉంది. టిడిపి హ‌యాంలో పేప‌ర్ లీక్ అయిన ఘ‌ట‌న‌లో అప్ప‌టి మంత్రి జీఎంసీ బాల‌యోగి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన చ‌రిత్ర‌ని ఒక్క‌సారి మీకు గుర్తు చేస్తున్నాను. మీ పాల‌న‌లో భ్ర‌ష్టుప‌ట్టిన విద్యాశాఖ‌, ఆ శాఖ‌ని చూసే మంత్రుల వ‌ల్ల ఇంకా ప‌త‌నావ‌స్థ‌కి చేరింది. సీఎంగా మీ వైఫ‌ల్యం, అధికారుల చేత‌గానిత‌నం, వైసీపీ నేత‌ల స్వార్థంతో టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అభాసుపాలై 6.22 లక్షల మంది విద్యార్థుల భ‌విష్య‌త్తు అయోమయంగా మారింది. ఇంకా రెండు రోజులు ప‌రీక్ష‌లున్నా..ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌తీ ప‌రీక్ష పేప‌ర్ లీకై ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌నే అప‌హాస్యం అయ్యింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మేథ్స్ క్వ‌శ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్ కి చేరకుండానే ముందుగా వైసీపీకి చెందిన వాట్స‌ప్ గ్రూపుల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.

ఏలూరు జిల్లా మండవల్లి హైస్కూల్‌లో పేపర్ లీక్ చేయడమే కాకుండా… స‌మాధాన‌ప‌త్రాలు రాసి అందించ‌డం ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో డొల్ల‌త‌నాన్ని వెల్ల‌డిస్తోంది. కృష్ణా జిల్లా పామర్రు, నంద్యాల, నందికొట్కూరుల్లో పేప‌ర్ లీక్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో ప‌రీక్ష కేంద్రాన్నే మార్చేయ‌గా, గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలో ఓ టీచర్ మాల్ ప్రాక్టీసుకి పాల్ప‌డ‌టం ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఎంత అధ్వానంగా ఉందో స్ప‌ష్టం చేస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా మాస్ కాపీయింగ్ విప‌రీతంగా జ‌ర‌గ‌డం క‌ష్ట‌ప‌డి చ‌దివిన విద్యార్థుల పాలిట శాపంగా మార‌నుంది. పేప‌ర్ల లీక్‌, మాల్ ప్రాక్టీస్‌, మాస్ కాపీయింగ్‌పై మీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌రీక్ష‌లు ప‌క‌డ్బందీగా జ‌రుగుతున్నాయ‌ని ఇచ్చిన స‌మాధానం కూడా బాధ్య‌తారాహిత్య‌మే. మంత్రి బొత్స‌ని విద్యాశాఖ నుంచి త‌ప్పించాలి. ఇంకా మిగిలిన రెండు పరీక్ష‌ల్ని అయినా ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాలి. ఇంత జరుగుతున్నా మీరు కనీసం పేపర్ లీక్ ఘటనల పై సమీక్ష జరపకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కి అద్దం పడుతుంది.

టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎదురైన ఘోర‌వైఫ‌ల్యం నుంచి గుణ‌పాఠం నేర్చుకుని ఇంట‌ర్ ప‌రీక్ష‌లైనా క‌ట్టుదిట్టంగా జ‌రిపేందుకు ఏర్పాట్లు చేయాల‌ని కోరుతున్నాను. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఘోర‌వైఫ‌ల్యం చెంది, విద్యార్థుల బంగారు భ‌విష్య‌త్తుతో ఆట‌లాడుకుంటోన్న‌ ఉన్న‌తాధికారుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలి అంటూ లోకేష్ లేఖలో పేర్కొన్నారు. 

నారా లోకేష్‌
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Related posts