telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

విద్యార్థుల విడుదల కోసం అమెరికా తెలుగు సంఘాల కృషి!

AATA Says Farmington Universisty Issue
ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ ఉచ్చులో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను విడిపించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు తొలిసారిగా న్యూయార్క్ లో సమావేశమయ్యాయి. డెట్రాయిట్ లో తెలుగు విద్యార్ధుల అరెస్టులపై  నాట్స్, తానా, ఆటా, నాటా, టాటా, టీఎల్ సీఏ సంఘాలు తెలుగు విద్యార్ధులు ఇబ్బంది పడకుండా  సాయం అందించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించాయి. తొలిసారిగా తెలుగు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి విద్యార్థులను విడిపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై చర్చలు జరిపాయి. ముందుగా అందరూ కాంగ్రెస్ మెన్ థామస్ సుజీ ని కలిసి తెలుగు విద్యార్ధులను మానవతా దృక్ఫధంతో విడుదల చేయాలని కోరాయి.
అవగాహన లేకపోవడంతోనే విద్యార్ధులు ఫార్మింగ్ టన్ యూనివర్సీటీ వలలో చిక్కుకున్నారని తెలిపాయి. తక్షణమే వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చాయి. దీనిపై అటు కాంగ్రెస్ మెన్ థామస్ కూడా సానుకూలంగా స్పందించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. తెలుగు అటార్నీలు ప్రశాంతి రెడ్డి, జొన్నలగొడ్డలతో కూడా ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు.
అన్ని సంఘాలు ఇప్పటికే అక్కడ తెలుగు విద్యార్ధులకు మేమున్నామని ధైర్యం చెబుతున్నాయి. రాయబార కార్యాలయంతో పాటు అటార్నీలతో చర్చలు జరిపి వీలైనంత తర్వగా వారిని విడిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గత శనివారం అమెరికాలోని పలు తెలుగు అసోసియేషన్లు భారత రాయబార కార్యాలయ అధికారి హర్షవర్దన్‌ ష్రింగ్లాను కలిసాయి. ఈ వివాదం నుంచి విద్యార్థులను రక్షించాలని కోరాయి. డిటెన్షన్‌కు గురైన విద్యార్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి.

Related posts