telugu navyamedia
సినిమా వార్తలు

80 సంవత్సరాల అక్కినేని ‘శ్రీ సీతారామ జననం’

అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నటించిన మొదటి సినిమా “శ్రీ సీతారామ జననం”. తెనాలిలో నాటకం వేసి విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిన అక్కినేని నాగేశ్వర రావు ను నిర్మాత దర్శకుడు ఘంటసాల బలరామయ్య చూశారు.  అప్పుడు అక్కినేని వయసు 20 సంవత్సరాలు.  అప్పుడు బలరామయ్య అక్కినేనిని పిలిచి ‘సినిమాలో నటిస్తావా?’   అని అడిగారు . ‘ఓ అవకాశం ఇస్తే నటిస్తా’ అని సమాధానం చెప్పాడు.

అక్కినేని దగ్గర అడ్రస్ తీసుకున్నాడు బలరామయ్య గారు . ఆ తరువాత కొన్ని రోజులకే బలరామయ్య గారి నుంచి మద్రాస్ రమ్మని పిలుపు వచ్చింది. 1944 మే 8వ తేదీన అక్కినేని తన పెద్ద అన్నయ్య రామ బ్రహ్మం గారితో మొదటిసారి మద్రాసులో  అడుగు పెట్టారు . అప్పుడు ఘంటసాల బలరామయ్య ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై   “శ్రీ సీతారామ జననం ” అన్న సినిమాను ప్రారంభించారు . ఈ సినిమాలో అక్కినేని ని శ్రీరాముడుగా ఎంపిక చేశారు .

“శ్రీ సీతారామ జనం ” సినిమాలో అక్కినేనితో పాటు వేమూరి గగ్గయ్య , బలిజేపల్లి లక్ష్మి కాంతం, త్రిపుర సుందరి,  పారుపల్లి సత్యనారాయణ, లంక సత్యం , రుషేంద్ర మణి మొదలైన వారు నటించారు . ఈ సినిమాలోనే ఘంటసాల వెంకటేశ్వర రావు కోరస్ గాయకుడు గా పరిచయం అయ్యారు . “శ్రీ సీతారామ జననం”. సినిమా 1944 డిసెంబర్ యువ తేదీన ఆంధ్ర దేశమంతా విడుదలయ్యింది ఈ సినిమా విడుదలై నేటికీ 80 సంవత్సరాలు .

ఏ ముహూర్తాన అక్కినేని ముఖానికి మేకప్ వేసుకున్నారో అక్కడ నుంచి ఆయన నట జీవితం విజయవంతంగా సాగింది. పద్మశ్రీ , పద్మ భూషణ్ , దాదా సాహెబ్ ఫాల్కే , పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అక్కినేనిని వరించాయి .. కృష్ణా జిల్లాలోని రామ పురంలో అక్కినేని పున్నమ్మ , వెంకట రత్నం దంపతులకు జన్మించిన అక్కినేని చదివింది ఎనిమిదవ తరగతి మాత్రమే . అయితేనేం ఆయన సినిమా నటుడుగా జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు . ఇది అక్కినేని నాగేశ్వర రావు శతాబ్ది సంవత్సరం .
– భగీరథ

Related posts