telugu navyamedia
సినిమా వార్తలు

74 సంవత్సరాల “షావుకారు”

నందమూరి తారకరామారావు గారు నటించిన విజయా వారి చిత్రం “షావుకారు” 07-04-1950 విడుదలయ్యింది.

నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలు విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకులు ఎల్.వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కధ,రచన: చక్రపాణి, స్క్రీన్ ప్లే: ఎల్.వి. ప్రసాద్, పాటలు: సముద్రాల, సంగీతం: ఘంటసాల, ఫోటోగ్రఫీ: మార్క్స్ బార్ట్లే, కళ: గోఖలే, కూర్పు: జంబులింగం, మణి అందించారు.

ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జానకి, ఎస్.వి. రంగారావు, గోవిందరాజుల సుబ్బారావు, శాంతకుమారి, పద్మనాభం, వి.శివరాం, వంగర, కనకం, శ్రీవాత్స్వవ, మాధవపెద్ది సత్యం, మోపర్రు దాస్ తదితరులు నటించారు.

మధుర గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల గారు స్వరకల్పనలో వెలువడిన పాటలు
“ఏమనెనే చిన్నారి ఏమనెనే”,
“పలక రాదటే చిలకా సముఖములో”
“తెలుపవలనే చిలుకా పలుకవలనే బదులు”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

పూర్తి గ్రామీణ వాతావరణంలో సహజత్వానికి దగ్గరగా నిర్మించిన ఇరుగు-పొరుగుల కధ ఈ షావుకారు చిత్రం.
ఈ చిత్రాన్నికి మంచి ప్రేక్షకాదరణ లభించింది.

ఈ చిత్రం విజయవంతంగా ఇటు తెలుగునాట, అటు తమిళనాడు లోను పలు కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడింది.

విజయవాడ. – దుర్గాకళామందిర్లో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం ద్వారా వెండితెరకు కథానాయికగా పరిచయమైన శంకరమంచి జానకి గారు ఆపిదప షావుకారు జానకి గా ప్రసిద్ధి కెక్కారు.

“మనదేశం”(24-11-1949) చిత్రం ద్వారా నందమూరి తారక రామారావు గారు నటుడిగా వెండితెరకు పరిచయం కాగా ఆయన తొలుత హీరో గా నటించిన చిత్రం బి.ఏ.సుబ్బారావు గారు నిర్మించిన “పల్లెటూరి పిల్ల” సినిమా.

అయితే ఎన్టీఆర్ గారు హీరోగా విడుదలైనది మాత్రం “షావుకారు” సినిమా కావటం విశేషం.

తన రెండవచిత్రమైన ఈ చిత్రం ద్వారా హీరో గా ఎన్టీఆర్ గారు చలనచిత్ర ప్రయాణాన్ని ప్రాంభించి అంచెలంచేలుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయ్యారు…

Related posts