telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

10న చిత్రపురిలో ఎన్నికలు.. మొదలైన కోలాటం

హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు ముగిసాయి. చిత్రపరిశ్రమలో ఎన్నికల వేడి మొదలైంది. చిత్రపరిశ్రమ కార్మికుల కోసం ఏర్పాటైన చిత్రపురికాలనీ లో సందడి మొదలైంది. ఈ నెల10న జరగబోతున్న ఎన్నికల్లో నాలుగు ప్యానెల్స్ పోటీపడబోతున్నాయి. ఈ ఏడాది జరగబోతున్న ఎలక్షన్లో నాలుగు ప్యానల్స్ పోటీపడుతున్నప్పటికీ ప్రధానమైన పోటీ మాత్రం రెండు ప్యానెల్స్ మధ్యనే ఉండనుంది. అవే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానెల్, సి. కళ్యాన్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’. వీటితో పాటు ఓ. కళ్యాణ్ ప్యానెల్, కొమర వెంకటేశ్ ప్యానెల్ కూడా బరిలో ఉన్నాయి. సి. కళ్యాణ్ ప్యానల్ లో సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, అమ్మిరాజు, కొల్లి రామకృష్ణ, సుమిత్రపంపన, వంటి వారితో పాటు దివంగత ప్రభాకర్ రెడ్డి సతీమణి ఎమ్. సంయుక్త రంగంలో ఉండగా… వినోద్ బాల ప్యానెల్ లో అనిల్ వల్లభనేని, కాదంబరి కిరణ్, అళహరి, చిల్లరవేణు, అనిత, దీప్తివాజ్ పాయ్ బరిలో దిగుతున్నారు.  25 ఏళ్ళు అయినా కార్మికులకు కాలనీకలగానే మిగిలిపోయిందని, చిత్రపురిహిల్స్ ని కాపాడి అందమైన, ఆదర్శవంతమైన కాలనీగా తీర్చి దిద్దాలన్నదే తమప్యానెల్ ముఖ్యోద్దేశమని అంటున్నారు మనప్యానెల్ వర్గీయులు. ఇక ఇప్పటికే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి మెంబర్స్ కి ప్లాట్స్ ను ఎలాట్ చేయటం జరిగిందని, మిగిలిన వారికి కూడా త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తామని అంటున్నారు వినోద్ బాల ప్యానెల్ వర్గీయులు. ఈ నెల 10వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి చిత్రపురిపోరులో విజయం సాధించే వారెవరో చూద్దాం.

Related posts