telugu navyamedia
సినిమా వార్తలు

66 సంవత్సరాల “భూకైలాస్”

నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా ప్రతినాయకుడు పాత్రలో నటించిన చిత్రం ఏ.వి.ఎం. వారి “భూకైలాస్” సినిమా 20-03-1958 విడుదలయ్యింది.

కర్ణాటక రాష్ట్రం లోని గోకర్ణం క్షేత్రం స్థలపురాణం ఆధారం గా నిర్మాత ఏ.వి. మెయ్యప్పన్ చెట్టియార్ గారు
ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కె.శంకర్. దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈచిత్రానికి మాటలు, పాటలు: సముద్రాల సీనియర్ , స్క్రీన్ ప్లే: కె.శంకర్, సంగీతం:ఆర్.సుదర్శనం – ఆర్. గోవర్ధనం.

ఫోటోగ్రఫీ: మాధవ బుల్ బులె, కళ: ఏ.బాలు, నృత్యం: గోపీ కృష్ణ,కమలా లక్ష్మన్, ఎడిటింగ్: కె.శంకర్, కె.నారాయణన్, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి రామారావు గారి మొదటి సారిగా ప్రతినాయకుడు రావణాసురుడు పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు గారు నారదుడు పాత్ర పోషించారు.

మిగిలిన పాత్రలలో ఎస్.వి.రంగారావు, జమున, బి సరోజాదేవి, నాగభూషణం, హేమలత,విజయ నిర్మల, హెలెన్ , మహంకాళీ వెంకయ్య, తదితరులు నటించారు.

సంగీత సోదరులైన ఆర్. సుదర్శనం,గోవర్ధనం ల సంగీత సారధ్యంలో మదురాతి మధురమైన పాటలు
“దేవ దేవ ధవళాచల మందిర”
“నారాయణ హరి నమో నమో”
“నీలకంథర దేవా దీనబాంధవా”
“రాముని అవతారం రవికుల సోముని అవతారం”
వంటి పాటలు శ్రోతలను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు,కన్నడ భాషలలో సమాంతరంగా నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్ గారు పోషించిన రావణాసురుడు పాత్రను కన్నడంలో రాజకుమార్ గారు పోషించారు.

తెలుగు సినిమా 20-3-1958 విడుదల కాగా కన్నడ సినిమా 05-03-1958 న విడుదల అయ్యింది. తెలుగులో తీసిన “భూకైలాస్” చిత్రాన్ని తమిళంలో “భక్త రావణ” పేరుతో డబ్బింగ్ చేసి 19-09-1958 న విడుదల చేశారు అలాగే
హిందీలో “భక్తి మహిమ” పేరు తో డబ్బింగ్ చేసి 20-10-1960 న విడుదల చేశారు.

తొలిసారిగా ప్రతినాయకుడైన “రావణ బ్రహ్మ” పాత్రను ఎన్టీఆర్ గారు అమోఘంగా పోషించి పండిత, పామరులను సైతం మెప్పించి, ఆపాత్ర పట్ల గల మక్కువతో ఆపిదప తమ స్వంత బ్యానర్ పై నిర్మించిన “సీతారామకళ్యాణం” చిత్రం లో శ్రీరాముని పాత్ర కాకుండా ప్రతినాయకుడు “రావణ బ్రహ్మ ” పాత్రను పూర్తి స్థాయిలో పోషించి అదే తనకు ఇష్టమైన పాత్రగా ఎన్టీఆర్ గారే స్వయంగా చెప్పటం జరిగింది.

ఈ చిత్రం విజయవంతమై ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్నప్పటికి శతదినోత్సవం జరుపు కోలేకపోయింది. ఈ చిత్రం కొన్నికేంద్రాలలో 50 రోజులు పైగా ఆడింది.
విజయవాడ – దుర్గా కళామందిరం లో 63 రోజులు వరకు ప్రదర్శింపబడింది.

Related posts