telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

61 సంవత్సరాల “లవకుశ”

నందమూరి తారకరామారావు గారు శ్రీరాముడు గా నటించిన తొలి రంగుల చిత్రం లలితా శివజ్యోతి పిక్చర్స్ వారి “లవకుశ” సినిమా 29-03-1963 విడుదలయ్యింది
నిర్మాత ఏ. శంకర రెడ్డి గారు లలితా శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై తండ్రీకొడుకులైన సి.పుల్లయ్య, సి.యస్.రావు గార్ల దర్శకత్వంలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఈ చిత్రాన్ని నిర్మించారు

ఈ చిత్రానికి కథ,మాటలు: సదాశివ బ్రహ్మం, పాటలు, పద్యాలు: సదాశివ బ్రహ్మం, సముద్రాల సీనియర్,
కొసరాజు, సంగీతం: ఘంటసాల, ఛాయాగ్రహణం:
పి.ఎల్.రాయ్, ట్రిక్ ఫోటోగ్రఫీ: రవికాంత్ నగాయిచ్,
కళ: టి.వి.యస్.శర్మ, నృత్యం : వెంపటి పెద సత్యం,
కూర్పు: సంజీవి. అందించారు.

ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు, అంజలీదేవి, కాంతారావు, నాగయ్య, సత్యనారాయణ, శోభన్ బాబు, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, సూర్యకాంతం, సంధ్య, కన్నాంబ, యస్.వరలక్ష్మి, ఎల్.విజయలక్ష్మి,, మాస్టర్ సుబ్రమణ్యం, మాస్టర్ నాగరాజు, లక్ష్మీ ప్రభ, లక్ష్మీ , వాసంతి, రీటా, సుకుమారి,ధూళిపాళ, కె.వి.ఎస్.శర్మ, డాక్టర్ శివరామకృష్ణయ్య, వి.శివరాం, ఏ.వి. సుబ్బారావు, కోటేశ్వరరావు, తదితరులు నటించారు.
మధుర గాయకులు, ప్రముఖ సంగీత దర్శకులు
ఘంటసాల గారి సంగీత సారధ్యంలో

ఈ చిత్రం లోని పాటలు, పద్యాలు సూపర్ హిట్ అయి చరిత్రలో నిలిచిపోయాయి.
“రామన్న రాముడు కోదండరాముడు”
“ఒల్లనోరి మామ నీ పిల్లనీ”
“జగదభిరాముడు శ్రీరాముడే”
“ఏ నిమిషానికి యేమి జరుగునో”
“రామకథను వినరయ్యా”
“వినుడు వినుడు రామాయణ గాథ”
“శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా”
వంటి వీనుల విందైన పాటలు, పద్యాలు నాటికి నేటికి ప్రేక్షకులను పరవసింపచేస్తున్నాయి.

“లవకుశ” చిత్ర నిర్మాణం కొంత భాగం తీసిన పిదప
దర్శకులు సి పుల్లయ్యగారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటంతో వారి కుమారుడు సి.ఎస్.రావు గారు దర్శకత్వ భాద్యతలు స్వీకరించి సినిమాను పూర్తి చేశారు.
ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు తీర్ధయాత్రలకు
పుణ్య క్షేత్రాలకు వెళ్ళినట్లు ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవారు. ఈ చిత్రం లో నటించిన అంజలీ దేవి, ఎన్.టి.రామారావు లను సీతా రాములుగా ప్రజలు కొలిచేవారు..

ఆ నాటి నుండి శ్రీరాముడు అంటే ఎన్టీఆర్ గారే అని ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచి పోయింది.
ఎన్నో వ్యయప్రయాసల కోర్చి తెలుగులో తొలిసారిగా తీర్చిదిద్దిన ఈ రసమయ రంగుల తెలుగు పౌరాణిక దృశ్యకావ్యం “లవకుశ” చిత్రం ఘన విజయం సాధించి
మొత్తం 72 కేంద్రాలలో శతదినోత్సవం,
18 కేంద్రాలలో రజతోత్సవం, 7 కేంద్రాలలో 200 రోజులు ద్విశతదినోత్సవం జరుపుకున్నది, అంతేకాకుండా 50 వారాలు ప్రదర్శింపబడిన తొలి స్వర్ణోత్సవ చిత్రం గాను, అలాగే 60 వారాలు ప్రదర్శించబడ్డ తొలి వజ్రోత్సవ
తెలుగు చిత్రంగా కూడా ఘనత కెక్కింది. ఈ విషయాన్ని
ఆనాడు వార్తా పత్రికలలో ప్రత్యేకంగా వ్యాసాలు కూడా ప్రచురిత మయ్యాయి.

ఈ చిత్రం తొలి విడత 26 కేంద్రాలలో విడుదలై, అన్ని కేంద్రాలలో డైరెక్ట్ గా 150 రోజులు ప్రదర్శింపబడింది. అలాగే 18 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడింది.
తొలి విడత 26 కేంద్రాలు లేట్ రన్ 46 కేంద్రాలు కలిపి మొత్తం 72 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడిన ఏకైక తెలుగుచిత్రంగా నేటికీ చెక్కుచెదరని రికార్డ్ ని స్వంతం చేసుకోవడం జరిగింది. అప్పటి దిన పత్రికలలో కలెక్షన్లు ప్రకటించిన తొలి దక్షిణాది చిత్రంగా 365 రోజులకుగాను కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రం “లవకుశ” అని ప్రకటించారు. అప్పుడు 0. 25 పైసలు, ఒక రూపాయి టికెట్ల రేట్లపై ఈ వసూళ్ళు సాధించడం గమనార్హం. ఈ నాటి రూపాయి విలువ ప్రకారం కొలమానం చేస్తే ఈ చిత్రం వసూళ్ళు నేటికీ రికార్డుగానే చెప్పుకోవాలి. ఆనాడు మన రాష్ట్ర జనాభా 3 కోట్లు అయితే సినిమాను చూసిన జనాభా 1.98 కోట్లమంది ఆదరించినట్లుగా ఆనాటి పత్రికా ప్రకటనలు చెబుతున్నాయి. ప్రతి కేంద్రం లోనూ ఆయా కేంద్రాల జనాభాకంటే 4 రెట్ల టికెట్లు అమ్ముడయ్యి అప్పటికీ ఇప్పటికీ కనీ వినీ ఎరుగని చరిత్ర సృష్టించింది చిత్రం “లవకుశ.”

కర్నాటకలో ఈ చిత్రం ఒకే థియేటర్లో 35 వారాలు ప్రదర్శించబడింది. ఆ పిదప 1977, 1980 లలో రిపీట్ రన్ గా బెంగుళూరులో విడుదలై మళ్ళీ శత దినోత్సవాలు జరుపుకుంది. ఇలా మూడుసార్లు ఒక సినిమా
బెంగళూరు వంటి నగరాలలో శత దినోత్సవం జరుపుకోవడం కన్నడ చిత్రాలకు కూడా సాధ్యం కాలేదు.

రిపీట్ రన్‌లలోని ప్రదర్శనలన్నీ కలిపితే వందకు పైగా కేంద్రాల్లో ఏడాది పైగా ప్రదర్శింప బడిన సినిమా దేశంలో ఇదొక్కటే అవుతుంది. తమిళ వెర్షన్ “లవకుశ” సైతం ఘన విజయం సాధించి మధురైలో 40 వారాలు ఆడటం, హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా రజతోత్సవం జరుపుకోవడం ద్వారా దేశమంతటా నీరాజనాలు అందుకుంది. భారత సినీ చరిత్రలో ఒకే చిత్రం ద్వారా ఒకే హీరో మూడు భాషల్లో రెండు సార్లు విజయాలను సాధించడం (మొదట ‘పాతాళభైరవి’, తర్వాత ‘లవకుశ’) నాటికీ, నేటికీ ఒక్క ఎన్టీఆర్‌ గారికే చెల్లింది.

విజయవాడ — మారుతి టాకీస్ లో 196 రోజులు,
రాజమండ్రి — వెంకటేశ్వర లో 260 రోజులు,
గుంటూరు — కృష్ణా పిక్చర్ ప్యాలస్ లో 253 రోజులు,
తెనాలి — సత్యనారాయణ టాకీస్ లో 192 రోజులు,
కాకినాడ — లక్ష్మీ లో 210 రోజులు,
నెల్లూరు — శ్రీరామ్ లో 210 రోజులు,
విశాఖపట్నం – రామకృష్ణ లో 189 రోజులు ఆడింది.
(విశాఖపట్నం లో మొట్టమొదటి రజతోత్సవ సినిమా)
వరంగల్ — రాజరాజేశ్వరి లో 252 రోజులు,
హైదరాబాద్ — బసంత్ లో 203 రోజులు ఆడింది.
తర్వాత షిఫ్ట్ తో 420 రోజులకు పైగా ఆడింది
నైజాం లో మొదటి 200 రోజుల సినిమా
నైజాం లో మొదటి 300 రోజుల, 365 రోజులు, 420 రోజులు ఆడిన సినిమా “లవకుశ”.
కోటిరూపాయల పైగా వసూలు చేసిన తొలి సినిమా
బెంగళూర్ లో లేట్ రన్ లో 280 రోజులు ఆడింది.

1980 లో రిపీట్ రన్ లో బెంగళూర్ లో 100 రోజులు ఆడి శత దినోత్సవం జరుపుకున్నది.
ఆ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి బహుమతి అందుకున్న చిత్రం “లవకుశ”.
ఒకే సంవత్సరం ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘కర్ణన్’ (తమిళం) వంటి మూడు అవార్డు చిత్రాల్లో నటించినందుకు గాను ఎన్.టి.రామారావు గారు భారత రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతిని అందుకోవడం జరిగింది…..

Related posts