telugu navyamedia
సినిమా వార్తలు

59 సంవత్సరాల “మంగమ్మ శపథం”

నందమూరి తారకరామారావు గారు నటించిన జానపద చిత్రం డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ “మంగమ్మ శపథం” 06-03-1965 విడుదలయ్యింది.

నిర్మాత డి.వి.ఎస్.రాజు గారు డి.వి.ఎస్. బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్నికి జానపదబ్రహ్మ ప్రముఖ దర్శకుడు బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, ఆత్మీయులైన డి.వి.ఎస్.రాజు గారు ఎన్టీఆర్ గారితో స్వంతం గా చిత్ర నిర్మాణం చేపట్టాలనే తలంపుతో తమిళం లో విజయవంతం అయిన చిత్రానికి ప్రాచుర్యంలో ఉన్న జానపద కధను జోడించి జానపదబ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు నిర్మాత డి.వి.ఎస్.రాజ గారు. తమ స్వంత నిర్మాణ సంస్థ డి.వి.ఎస్. బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం” మంగమ్మ శపథం”. కాగా ఈ చిత్రాన్నికి కో-డైరెక్టర్ గాఎస్.డి.లాల్ వ్యవహరించారు.

ఈ చిత్రాన్నికి మాటలు: సముద్రాల జూనియర్, సంగీతం: టి.వి.రాజు, పాటలు: సి.నారాయణ రెడ్డి, కొసరాజు, ఫోటోగ్రఫీ: ఆర్.సంపత్, కళ: తోట, నృత్యం: వెంపటి సత్యం, చిన్ని, ఎడిటింగ్: జి.డి.జోషీ, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, జమున, రాజశ్రీ, ఎల్.విజయలక్ష్మి, రాజనాల, రేలంగి, గిరిజ, పద్మనాభం, అల్లూరి రామలింగయ్య, రమణారెడ్డి, మిక్కిలినేని, ఛాయాదేవి, వాణీశ్రీ తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి స్వరకల్పనలో పాటలన్నీ హిట్ అయ్యాయి.
“రివ్వునసాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదేపదే సవ్వడి చేస్తున్నది”,
“నీరాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయి నీదే కదా”,
“కనులీవేళ చిలిపిగ నవ్వెనూ మనసివేళ యేవేవో వలపులు రువ్వెనూ,”
“ఒయ్యారమొలికే చిన్నదీ ఉడికించు చున్నది రమ్మంటే రాను పొమ్మన్నది,”
వంటి పాటలు ప్రేక్షకులను సన్మోహన పరిచాయి.
ఈచిత్రం లో ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు.

ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం “మంగమ్మ శపథం”. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషం గా ఆకర్షించింది.

ఈ చిత్రం విజయవంతమై విడుదలైన దాదాపుగా అన్ని కేంద్రాలలో 50 రోజులు, డైరెక్ట్ గా నాలుగు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.
1.విజయవాడ – జైహింద్ టాకీస్
2.గుంటూరు – హరిహర మహల్
3.రాజమండ్రి – వెంకట నాగదేవి పిక్చర్ ప్యాలెస్
4.నెల్లూరు – శ్రీనివాస మహల్
ధియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడింది.

Related posts