telugu navyamedia
సినిమా వార్తలు

57 సంవత్సరాల “కంచుకోట”

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్ర రాజం విశ్వశాంతి వారి
“కంచుకోట” సినిమా 22-03-1967 విడుదలయ్యింది.

ఎన్టీఆర్ గారి బంధువు యు.విశ్వేశ్వరరావు గారు నిర్మాత గా విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సి.ఎస్.రావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్నికి కథ, మాటలు: త్రిపునేని మహారథి, సంగీతం: కె.వి. మహాదేవన్, పాటలు: దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, ఆరుద్ర, ఆత్రేయ, మహారధి, ఛాయాగ్రహణం: జి.కె. రాము, నృత్యాలు: చిన్ని,సంపత్, కళ: ఎస్. కృష్ణారావు, కూర్పు: ఆర్. హనుమంతరావు, అందించారు

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, దేవిక, సావిత్రి, కాంతారావు, నాగయ్య, ధూళిపాళ్ల, రాజనాల, ప్రభాకర రెడ్డి, ఉదయకుమార్, పద్మనాభం, వాణిశ్రీ, కాంచన,శాంతకుమారి, ఎల్.విజయలక్ష్మి, రమణా రెడ్డి, సత్యనారాయణ, నెల్లూరి కాంతారావు, జయశ్రీ, తదితరులు నటించారు

దర్శకుడు సి.ఎస్.రావుగారి దర్శకత్వ ప్రతిభకు “కంచుకోట” సినిమా ఒక కొలమానం గా చెప్పవచ్చు. జానపద చిత్రంలో సస్పెన్స్‌ను మేళవించి అత్యఅద్భుతంగా రూపొందించారు.

ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా, ఏదో ఒక అంశం ఇంకా అర్థం కాకుండా ప్రేక్షకులకు మిగిలే ఉంటుంది, అందుకని ప్రేక్షకులు మరొకసారి ఈ సినిమా చూడాలనిపిస్తుంది.

ఇక చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచింది మహారథి సమకూర్చిన పదునైన సంభాషణలు. ప్రతి సన్నివేశాన్ని భావోద్వేగాలతో కూడిన శక్తివంతమైన మాటలతో ఆయన అలరింపచేశారు.

ప్రఖ్యాత సంగీత దర్శకులు కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
“లేదులేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు”
“నీ పుట్టినరోజు నీనోములు పండినరోజు”
“సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ”
“ఈడొచ్చిన పిల్లనోయి'”
వంటి పాటలు శ్రోతలను విశేషం గా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం మొదటి వారం ఏడు లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించినది.

‘కంచుకోట’ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు,
ఐదు కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది.
29-06-1967 న విజయవాడ — విజయా టాకీస్ లో శత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సినిమా
1. విజయవాడ – విజయా టాకీస్, (105 రోజులు)
2. తిరుపతి – ఐ.ఎస్.మహల్ లలో డైరెక్ట్ గాను
మరొక మూడు కేంద్రాలలో షిఫ్టుల మీద
శతదినోత్సవం జరుపుకున్నది..

మరల 1975 లో రిపీట్ రన్ లో విడుదలైనపుడు కూడా రోజు 3 ఆటలతో మరోసారి శతదినోత్సవం హైద్రాబాద్ – బాలానగర్‌లోని ‘శోభన’ థియేటర్‌లో (105 రోజులు) జరుపుకుని దక్షిణ భారతదేశ చలన చిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది.

1975 డిసెంబర్ 4న హైదరాబాద్ – శోభన థియేటర్లో ఈ చిత్రం రిపీట్ రన్ శతదినోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

1968 లో బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో “కంచుకోట ” చిత్రాన్ని ప్రదర్శించారు.
ఈ సినిమా నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు ఎన్టీఆర్ బంధువు( వియ్యంకుడు) విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా “కంచుకోట” తర్వాత ఎన్టీఆర్ గారితో ‘”నిలువు దోపిడి, పెత్తందార్లు,
దేశోద్ధారకులు, తీర్పు”‘ వంటి పలు శతదినోత్సవ సినిమాలు ఎన్టీఆర్ గారితో నిర్మించారు.

Related posts