telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విశాల్ కు షాక్… నడిగర్‌ సంఘం ఎన్నికలను రద్దు చేస్తూ మద్రాస్‌ హైకోర్టు తీర్పు

Nadighar

గతేడాది వివాదాస్పద పరిస్థితుల్లో జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికలను రద్దు చేస్తూ మద్రాస్‌ హైకోర్టు తీర్పునివ్వడం కోలీవుడ్‌ని షాక్ కు గురి చేసింది. నడిగర్‌ సంఘానికి మళ్లీ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు నాజర్‌, విశాల్‌ సారథ్యంలోని ప్రస్తుత కార్యవర్గం నిర్ణయించగా, ఈసారైనా ఎన్నికలు న్యాయంగా, పారదర్శకంగా జరగాలని ఆశిస్తున్న ట్లు మరో వర్గం ప్రతినిధి ఐసరి కె.గణేష్‌ పేర్కొన్నారు.

2019, జూలై 23వ తేదీన చెన్నైలో నడిగర్‌ సంఘానికి ఎన్నికలు జరిగాయి. నాజర్‌, విశాల్‌ సారథ్యంలోని పాండవర్‌ జట్టు, కె.భాగ్యరాజా, ఐసరి కె.గణేష్‌ సారథ్యంలోని శంకరదాస్‌ జట్లు పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల పై కొందరు సభ్యులు కోర్టులో పిటిషన్‌ వేయడంతో ఓట్ల లెక్కింపు నిలిపివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. గత ఏడు నెలలుగా ఓట్లు బ్యాలెట్‌ బాక్సుల్లోనే ఉన్నాయి. ఆ కారణంగా నడిగర్‌ సంఘం కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాల్‌ బృందం కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఆ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ ఇద్దరు సభ్యులు మళ్లీ కోర్టులో పిటిషన్‌ వేశారు. బదులుగా విశాల్‌ బృందం కూడా అప్పీలుకెళ్లింది. ఈ పిటిషలన్నింటినీ ఒక్కటిగా పలు దఫాలు విచారణ జరిపారు. అయితే తీర్పును న్యాయమూర్తులు రిజర్వ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మరొకసారి ఈ వ్యవహారం విచారణకు రాగా మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి కల్యాణసుందరం తీర్పు వెలువరించారు. అందులో.. గతేడాది జూన్‌ 23న జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికలు రద్దు చేస్తున్నామని, ఆ ఎన్నికలు చెల్లవని ప్రకటిస్తూ, 3 నెలల్లో మళ్లీ ఎన్నికలు జరపాలని ఆదేశించారు. కొత్త కార్యవర్గం ఎన్నికయ్యే వరకు ప్రత్యేక అధికారి గీత పర్యవేక్షణలోనే నడిగర్‌ సంఘం ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. ఇక మళ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తి గోకుల్‌దా్‌సకు అప్పగించారు. ఇదిలా ఉండగా, హైకోర్టు తీర్పుపై అప్పీలుకెళ్లాలని విశాల్‌ బృందం భావిస్తోంది.

Related posts