telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చెన్నై : .. జూట్‌ ఫెయిర్‌ కు .. విశేష స్పందన..

great response to jute fair in chennai

ప్రస్తుతం అందరూ జూట్‌ అని స్టైల్‌గా పిలుస్తున్న జనపనారతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భారత వ్యవసాయరంగంలో ప్రాచీన విధానాల్లో అత్యధిక ప్రాముఖ్యత కలిగింది కూడా. ముఖ్యంగా దేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో జనపనారతో ఉత్పత్తుల తయారీ అధికంగా జరుగుతుంది. వాటిలో జూట్‌ బ్యాగ్‌లు, ఫ్లోర్‌ కవరింగ్‌లు, డెకరేటివ్‌ ఫ్యాబ్రిక్స్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌ వంటివి కొన్ని. చూడ్డానికి ఆకర్షణీయంగా, మన్నికగా వుండే ఈ వస్తువులను నేటి తరం యువత కూడా స్టైల్‌కు చిహ్నంగా భావిస్తున్నారు. పైగా పర్యావరణహితం కావడంతో ప్రభుత్వం కూడా జూట్‌ వస్తువుల విక్రయాలను ప్రోత్సహిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని హస్త కళాకారులు తయారుచేసిన ఈ జనపనార బ్యాగ్‌లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా స్థానిక మైలాపూర్‌ లజ్‌ చర్చ్‌ రోడ్డులో వున్న కామధేను కల్యాణ మహల్‌లో ‘జూట్‌ ఫెయిర్‌’ను ఏర్పాటు చేశారు.

జాతీయ జూట్‌ బోర్డు (ఎన్‌జేబీ), కేంద్ర జౌళి మంత్రిత్వశాఖల సంయుక్త నిర్వహణలో హస్త కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తరచూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సహజ నారతో తయారుచేసిన పర్యావరణసహిత ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా ఈ ప్రదర్శనల నిర్వహణల ఉద్దేశం. చెన్నైలో వున్న ఎన్‌జేబీ కార్యాలయం తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ బాధ్యతలను నిర్వహిస్తోంది. ‘జూట్‌ వస్తువులను వినియోగించడం – భావితరాలను కాపాడండి’ అన్న నినాదంతో ప్రచారం చేస్తోంది. చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్ర హ్యాండ్‌ల్యూమ్స్‌, హ్యాండిక్రాఫ్ట్స్‌, టెక్స్‌టైల్స్‌, ఖాదీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ జయంత్‌ ప్రారంభించారు. ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్న జూట్‌ ఫెయిర్‌ను నగరంలోని ప్రజలందరూ తిలకించి హస్త కళాకారులను ప్రోత్సహించాలని ఆ సందర్భంగా ఆయన కోరారు.

Related posts