టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు ‘డాటర్స్ డే’ సందర్భంగా తన గారాలపట్టి సితారకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె సితారను ఉద్దేశిస్తూ.. ఓ స్పెషల్ వీడియోను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. అనేక సందర్భాల్లో సితారతో కలిసి దిగిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. ‘నా బుజ్జి సితా పాపా నీకు ‘డాటర్స్ డే’ శుభాకాంక్షలు. నువ్వు చాలా అద్భుతమైన, ప్రియమైన, అల్లరి కుమార్తెవు. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను.’ అని మహేశ్ పేర్కొన్నారు. మరోవైపు నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ.. సితారకు ‘డాటర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపారు.
‘నా జీవితంలో వెలుగు దివ్వెవు నువ్వు. నా ఆకాశంలో ప్రతిక్షణం మెరుస్తుండే చిన్ని తారవు నువ్వు. నా ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా మార్చావు. లవ్ యూ సితార.’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘మహర్షి’ హిట్ తర్వాత మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. అలనాటి తార విజయశాంతి ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.