నటరత్న, పద్మశ్రీ నందమూరి తారకరామారావు గారు నటించిన మరొక సాంఘిక హిట్ చిత్రం శ్రీ తారకరామా ఫిలిం యూనిట్ సమర్పించు “‘డ్రైవర్ రాముడు'” 02-02-1979 విడుదల.
నందమూరి హరికృష్ణ నిర్మాత గా తారకరామా ఫిలిం యూనిట్ బ్యానర్ పై ఎన్టీఆర్ గారు నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కి స్క్రీన్ ప్లే: కె. రాఘవేంద్రరావు, మాటలు: జంధ్యాల, పాటలు: ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, సంగీతం: చక్రవర్తి, ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రకాష్, కళ: కుదరవల్లి నాగేశ్వరరావు, నృత్యం: సలీం, కూర్పు: కె.బాబురావు, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, జయసుధ, సత్యనారాయణ, రావు గోపాలరావు, మోహన్ బాబు, రోజారమణి, శ్రీధర్, మాడా, జయమాలిని, ముక్కామల, ఆనందమోహన్, షెట్టి(బాంబే), జగ్గారావు, కాంచన, మమత, ఛాయాదేవి, హలం, సారథి, చిడతల అప్పారావు తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి సంగీత సారధ్యంలో పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి.
“గుగ్గు గుగ్గు గుడిసింది”
“మామిళ్లతోపు కాడ”
“వంగమాక వంగమాక”
“ఏమని వర్ణించను”
“దొంగా దొంగా దొరికాడు”
వంటి పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ , దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన నాల్గవ చిత్రం “డ్రైవర్ రాముడు”. ఈచిత్రం ఘన విజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా 5.5 కోట్లు రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఈ చిత్రం విడుదలైన పలు కేంద్రాల్లో 50 రోజులు, లేట్ రుంతో కలుపుకుని మొత్తం 16 (14+2) కేంద్రాలలో 100 రోజులు (శతదినోత్సవం) జరుపుకుని, 2 కేంద్రాల్లో (తిరుపతి, విజయవాడ) 25 వారాలు (సిల్వర్ జూబ్లీ) ప్రదర్శింపబడింది.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1.విజయవాడ– దుర్గా కళామందిరం (115రోజులు),
2.గుంటూరు- నాజ్,
3.రాజమండ్రి- అశోకమహల్ ,
4.కాకినాడ– కల్పన,
5.విశాఖపట్నం — సరస్వతి పిక్చర్ ప్యాలెస్ (106 రోజులు),
6.నెల్లూరు — రంగమహల్,
7.విజయనగరం – లీలామహల్,
8.ఒంగోలు — నవభారత్ పిక్చర్ ప్యాలెస్,
9.మచిలీపట్నం — నటరాజ్ + మినర్వా టాకీస్( షిఫ్ట్),
10.తిరుపతి – వెంకటేశ్వర టాకీస్
11.కర్నూల్– ఆనంద్ + అలంకార్,
12.కడప — సాయిబాబా,
13.ప్రొద్దుటూరు(లేట్ రన్) — చాంద్,
14.వరంగల్ — రామా టాకీస్,
15.ఖమ్మం – నర్తకి,
16.హైదరాబాద్- సంగం (49 రోజులు+ షిఫ్ట్ పై 130 రోజులు)
175 రోజుల ఆడిన కేంద్రాలు:-
1) తిరుపతి– వెంకటేశ్వర టాకీస్(175 రోజులు,డైరెక్ట్), 2) విజయవాడ- దుర్గా కళామందిరం(115 రోజులు) + షిఫ్ట్ పై 175 రోజులు ఆడింది.
తిరుపతిలో రజతోత్సవ వేడుకలను దొరస్వామిరాజు (వి.ఎం.సి డిస్ట్రిబ్యూటర్) నిర్వహించారు 1982,1984,1995 రిపీట్ రన్ లలో మూడు సార్లు 50 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. పలు సినిమాల్లో అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని అపురూపంగా చూపించిన ఎన్టీఆర్, రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆడపడుచులకు అన్నగా వ్యవహరిస్తూ, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలుచేశారు.
మహిళలకు ఆర్థికస్వాతంత్య్రం, ఆస్తిలో సమాన హక్కు కల్పించినప్పుడే సమాజం అన్నివిధాలా పురోగమిస్తుందని ఎన్టీఆర్ గారు గట్టిగా నమ్మారు. అందుకే తన సొంత కుటుంబ వ్యవహారాల్లోనూ మహిళల సాధికారతకు పెద్దపీట వేశారు ఆయన. అందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ గా పేర్కొనవచ్చు.
1978 సం. నాటికి ఎన్టీఆర్ గారి కుమారుల్లో నలుగురికి మాత్రమే వివాహమైయింది. ఆ నలుగురు కోడళ్ళకు (పద్మజాదేవీ జయకృష్ణ, మాధవీమణీ సాయికృష్ణ, లక్ష్మీ హరికృష్ణ, శాంతీ మోహన్ కృష్ణ) ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక సినిమాను నిర్మించారు ఎన్టీఆర్ గారు.
ఆ నలుగురు కోడళ్ళు యజమానులుగా “శ్రీతారకరామా ఫిలిమ్ యూనిట్” బ్యానర్ పై నిర్మించిన సినిమాయే “డ్రైవర్ రాముడు”. చిత్ర నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని కుమారుడు హరికృష్ణకు అప్పగించారు. ఈ విధంగా కోడళ్ళ కోసం ప్రత్యేకంగా సినిమా నిర్మాణం చేపట్టిన ఘనత ఒక్క ఎన్.టి.రామారావు గారికే దక్కింది.
“డ్రైవర్ రాముడు” సినిమా మీద వచ్చిన లాభాలతో హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వద్ద నలుగురు కొడుకులకు నాలుగు గృహాలు నిర్మించి, కోడళ్ళ పేరు పెట్టారు. ఇప్పటికీ ఎన్టీఆర్ గారి వారసులైన వీరు నలుగురు ఆ గృహాలలోనే నివసిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన కోడళ్ళను కూడా కూతుళ్ళుగా ఆయన భావించారు కాబట్టే ముందుచూపుతో కోడళ్ళ ఆర్థిక స్వేచ్ఛ కోసం ఎన్.టి.రామారావు గారు కృషి చేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు….