telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సెలవైనా.. శరవేగంగా

  • కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాల చెల్లింపు
  • ఆదివారమూ కొనసాగిన ట్రెజరీ కార్యకలాపాలు
  • వాస్తవాలను గ్రహించేలా సర్కారు చర్యలు
  • జీతాల బిల్లులను అడ్డుకుంటే ఉపేక్షించబోమని గట్టి హెచ్చరిక
  • ఉద్యోగులు రాజకీయ శక్తుల వలలో చిక్కుకోకుండా ముందుకు

ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు విజయనగరం జిల్లాలో 175 మంది డీడీఓలకు మెమోలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలు సెలవు రోజైన ఆదివారం సైతం శరవేగంగా బిల్లుల ప్రాసెస్‌ నిర్వహించాయి.

ఆర్థికశాఖ ఆదేశాలతో ప్రత్యక్షంగా కలెక్టర్లే రంగంలోకి దిగి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెలాఖరు కావడంతో సాయంత్రం కల్లా పూర్తి చేసేలా అన్ని జిల్లాల్లో బిల్లుల ప్రాసెస్‌ జరుగుతోంది.

కొత్త జీతాలతో వాస్తవాలు వెల్లడి..

జీతాలు తగ్గుతాయన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మొత్తాలను ఫిబ్రవరి 1 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను అందుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలను అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అందరి జీతాలు పెరిగాయని స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. అందుకనే శరవేగంగా జీతాల బిల్లుల ప్రాసెస్‌ చేపట్టింది. కొన్ని రాజకీయ శక్తులు పన్నిన కుట్రలకు ఉద్యోగులు బలి కాకుండా కాపాడుకుంటూ నిజం ఏమిటో తెలియజేసేలా చర్యలు చేపట్టింది. దీనికి అడ్డుపడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని గట్టి సంకేతాలనిచ్చింది. విజయనగరంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన డీడీవోలకు మెమోలిచ్చారు.

చిత్తూరులో సజావుగా..
చిత్తూరు జిల్లాలో కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లుల చెల్లింపు జరిగేలా కలెక్టర్‌ హరినారాయణన్‌ పర్యవేక్షించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 17 సబ్‌ ట్రెజరీ కార్యాలయాలు ఆదివారం పనిచేసినట్లు చెప్పారు. అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించామన్నారు.

ఉత్తర్వులు పాటించాల్సిందే..
ప్రకాశం జిల్లాలో అన్ని శాఖల డీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అన్ని శాఖల హెచ్‌ఓడీలు, జిల్లా అధికారులకు డీడీవోలతో పని చేయించాలని, లేనిపక్షంలో మెమోలు జారీ చేయాలని ఆదేశించామన్నారు. పనిచేయని డీడీవోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

ఉత్తరాంధ్రలో వేగంగా..ఉభయ గోదావరిలో రెండు రోజులుగా.. బిల్లుల పని ప్రారంభించారు.

Related posts