తన ఆవులను ఎవరో దొంగిలించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు వాటి అచూకి లభ్యం కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులను దొంగిలించే ముఠా గుట్టు రట్టు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. 2020 అక్టోబర్ లో తన ఆరు (6) ఆవులు దొంగిలించబడ్డాయని..దొంగిలించబడి ఇప్పటికే మూడు నెలలు అయిపోయిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను నిత్యం పూజించే ఆవు కూడా దొంగిలించబడిందని తెలిపారు. ఈ మేరకు ఆ ఆవుతో జగ్గారెడ్డి దిగిన ఫోటోను విడుదల చేశారు. అయితే తన ఆవులను దొంగలించడం తో..ఇంట్లో దూడలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇచ్చానని… పోలీసులు వెతుకుతున్నారన్నారు. కానీ ఆవు దొంగతనం చేసిన వారిని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని…ప్రేమతో పెంచుకున్న ఆరు ఆవులు దొంగిలించినా ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఆవులను మేత కోసం వదిలితే దొంగలు కబేళాలకు తరలిస్తున్నారని.. తన ఆవులే కాదు..సంగారెడ్డి లో చాలా ఆవులు, ఎడ్లు దొంగలించబడ్డాయన్నారు. ఇలాంటివి జరగకుండా చూడాలని పోలీస్ వ్యవస్థను డీజీపీని కోరుతున్నానని..దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు జగ్గారెడ్డి.
previous post


కాలుష్యంపై బీజేపీ నేతల రాజకీయాలు: కేజ్రివాల్