telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబును పట్టించుకోకుండా వెళ్లిన ఆ సత్యభామ ఎవరు ?

Sobhan-Babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి… “సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. ఈరోజు శోభన్ బాబును పట్టించుకోకుండా వెళ్లిన ఆ సత్యభామ ఎవరో చూద్దాం.

1971 నవంబర్ 27న శోభన్ బాబు నటించిన “చెల్లెలి కాపురం” చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. ఆ తరువాత శోభన్ బాబుకు లభించిన అరుదైన అవకాశం “సంపూర్ణ రామాయణం”. అప్పటి వరకు రాముడు అంటే ఎన్టీఆరే… కానీ “సంపూర్ణ రామాయణం”లో రాముడు పాత్రకోసం బాపుగారు శోభన్ బాబును ఎంచుకొని సాహసం చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పాత్రకు శోభన్ బాబు పనికొస్తాడా ? అని ప్రేక్షకులు, పరిశ్రమ అనుమానించారు. కానీ బాపుగారు మాత్రం శోభన్ బాబు పట్ల నమ్మకంతో ఉన్నారు. ఆ చిత్రంలో శోభన్ బాబును నటించొద్దన్నారు… అలాగని జీవించొద్దని అన్నారు… కేవలం శ్రీ మహావిష్ణువు అవతారం అని తెలీని ఒక అమాయకపు బాలుడిగా ప్రవర్తించామన్నారు బాపుగారు.

sobhan-babu2 ఇక సంపూర్ణ రామాయణం అవుట్ డోర్ లో చిత్రీకరించిన తొలి చిత్రం. కొన్ని రోజులు స్టూడియోలో కూడా షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. అలా ఓ రోజు ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. సాయంత్రం పూట ఆరుబయట శ్రీరాముడి వేషంలో సహనటీనటులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు శోభన్ బాబు. అకస్మాత్తుగా చుట్టూ ఉన్న వానర వేషగాళ్ళు బిలబిలమంటూ పరిగెత్తారు. వీళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారా ? అని ఆశ్చర్యంతో చూస్తున్నారు శోభన్ బాబు.

స్టూడియోలోకి ఓడ అంత పెద్దగా ఉన్న ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. కారు తలుపు తెరుచుకుంది. సంధ్యాకాంతుల్లో బంగారు పసిమి ఛాయలు వెదజల్లే ఓ బంగారు బొమ్మ సత్యభామ వేషంలో దిగింది. ఆమె నడుస్తుంటే అడుగడుగునా అందెల రవళులు విన్పిస్తున్నాయి. ముందు ముగ్గురు… వెనుక ఎనిమిది మంది మధ్య కప్పుకున్న మేలిమి శాలువాను సర్దుకుంటూ… దారి చూసుకుంటూ ఎదురుగా ఉన్న ఫ్లోర్ లోకి వెళ్ళిపోయింది ఆ వయ్యారిభామ. ఒక్కసారైనా తమవైపు చూస్తుందేమో అనుకున్న వానరసైన్యానికి నిరాశే ఎదురయ్యింది.

sobhan-babu1

ఇక ఆమె గురించి రాముడికి చెప్పడం మొదలుపెట్టారు రామబృందం. అంత ఠీవిగా గర్వంగా అచ్చంగా సత్యభామలా వెళ్లిన ఆమె ఎవరో కాదు కుమారి జయలలిత… అందగత్తె అంటే ఆమేనని… వచ్చిరాని తెలుగు పలుకులతో కోట్లమంది అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన కోకిలమ్మ ఆమేనని… అలా చెప్పుకుంటూ పోయారు రామబృందం. కానీ రాములవారి మాత్రం సత్యభామను చూసిన ముచ్చట తీరనేలేదు. ఆమెను చూడడానికి బయలుదేరాడు రాముల వారి మేకప్ లో ఉన్న శోభన్ బాబు.. అంతలోనే సహాయ దర్శకుడు దూసుకొచ్చి “అటెక్కడికి రామా… అక్కడ ఉన్నది సత్యభామ… మన లొకేషన్ ఇటున్నది.. మరిచితిమా..” అంటూ షాట్ కు తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడ జయలలితను చూడలేకపోయారు శోభన్ బాబు. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది శోభన్ బాబులో. ఆ తరువాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారనుకోండి… అది తరువాత కథ. ఇలా శోభన్ బాబును చూడనైనా చూడకుండా… ఆయన కళ్ళముందు నుంచే అందంగా సత్యభామలా కదిలి వెళ్ళింది జయలలిత.

sobhan-babu-3

ఇవి కూడా చదవండి

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts