telugu navyamedia
ఆంధ్ర వార్తలు

డిసెంబర్లో మార్కెట్లోకి TTD పంచగవ్య ఉత్పత్తులు

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తయారు చేయనున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ లో మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో బుధవారం ఈవో మాట్లాడుతూ, ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు ఈ లోపు ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన డిజైన్ లు కూడా సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజనీరింగ్ పనులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కోయంబత్తూర్ కు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు, సదరు సంస్థ 10 సంవత్సరాల పాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసి టీటీడీకి అందజేస్తుందని ఈవో వివరించారు. ఫ్లోర్ క్లీనర్, సోపులు, షాంపూ, దంత మంజనం పౌడర్, ఆయుర్వేద అగరబత్తులు లాంటి ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. వీటిలో టీటీడీ వాడగా, మిగిలినవి విక్రయాలకు పెట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 70 రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఆయుష్ వద్ద లైసెన్సులు పొందే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ఆయుర్వేద ఫార్మసీ లో ఇప్పటికే 115 రకాల మందులు తయారు చేస్తున్నట్లు ఈవో చెప్పారు.

Related posts