telugu navyamedia
సినిమా వార్తలు

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

shobhan-babu

శోభన్ బాబు ఆంధ్రులకు అందాల నటుడు. ఆయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రల్లో రాణించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుని ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. “సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు. శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము… అందులో భాగంగానే హీరోనవుతానని శోభన్ బాబు తన తాతగారికి చెప్పగా ఆయన ఎలా స్పందించారో చూద్దాం.

Sobhanbabu Awards 2018 images

డిగ్రీ పూర్తయ్యేనాటికి శోభన్ బాబుకు పెళ్లి కూడా అయిపోయింది. ఆ తరువాత శోభన్ బాబు ఇంజనీరింగ్ చెయ్యాలని పెద్దలు తీర్మానించారు. అలీఘడ్ యూనివర్సిటీలో చదవడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసేశారు. అయితే శోభన్ బాబు మాత్రం ఇంజనీరింగ్ చదవాలా లేక మద్రాసులో లా కోర్సులో చేరాలా అనే డైలామాలో పడ్డారు. మద్రాసులో అయితే సినిమా ప్రయత్నాలు కూడా చేయవచ్చన్న ఆలోచనతో మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చి అదే విషయాన్ని ఆయన నాన్నగారితో చెప్పారు. వారు సరేనన్నారు. మద్రాసులో సినిమాల్లో ప్రయత్నం చేయబోతున్నామని స్నేహితులతో చెప్పగా వారిలో కొంతమంది హీరో లక్షణాలున్నాయి. ప్రయత్నం చెయ్ అంటూ ప్రోత్సాహం ఇచ్చారు. మరికొందరు మాత్రం చదువు పాడుచేసుకోకు. సినిమాల్లో 100లో ఎవరో ఒకరే తారాపథంలో దూసుకుపోతారు. తీరాచూస్తే జిరోల్లా మిగిలిపోయిన 99 మంది గురించి ఆలోచించము. ఎన్టీఆర్, ఏఎన్నార్ ను చూసి మనమూ హీరోలైపోవాలని అందరూ కలలు కంటారు. కొంచం ముందు చూపుతో అలోచించి బాగా చదువుకో.. అంటూ హితబోధ చేశారు.

shobhan-babu1

లా కోర్స్ నెపంతో మద్రాసులో అడుగుపెట్టాలన్నదే శోభన్ బాబు ఆలోచన తప్ప లాయర్ అయిపోవాలన్నది ఆయన ఆశయం కాదు. పొరపాటున అబద్ధం చెబితేనే లోలోపల కుంగిపోయే శోభన్ బాబు అబద్ధాలనే వృత్తిగా స్వీకరించలేనని, అసలే సుతిమెత్తనైన మనసుగల తాను లాయర్ గా కొనసాగలేననేది ఆయన ఆలోచన. కానీ అప్పుడే గట్టిగా నిర్ణయించేసుకున్నారు శోభన్ బాబు… అయితే హీరో కావాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా కామెడీ ఆర్టిస్ట్ అయ్యే ప్రసక్తే లేదని. ఆంధ్రుల మనస్సులో హీరోగానే ఉండాలని, హీరోగానే రిటైరైపోవాలని… హీరోగానే మిగిలిపోవాలని… హీరోగానే రాలిపోవాలని. ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. ప్రయత్నించకపోతే ఫలితం లేదు. అందుకే ముందుగా కొన్నాళ్ళు ప్రయత్నించి చూద్దాం. హీరోనయ్యానా సరేసరి… లేకపోతే లేదు అనే తన నిర్ణయాన్ని ఆయన తాతయ్యకు చెప్పేశారు శోభన్.

Shobhan-babu-with-ntr

శోభన్ బాబు నిర్ణయం విన్న ఆయన తాతయ్య “ఒక్క విషయం గుర్తుంచుకోరా… మనకు లేకపోతే అవతలి వాళ్ళు నవ్వుతారు. ఉంటే అసూయ పడతారు. అనుభవాలే అన్నిటికన్నా గొప్పవి. నువ్వు ఏం చదువుకుంటావు, ఏం చేస్తావన్నది నీ ఇష్టం. కానీ నవ్వులపాలు మాత్రంకావొద్దు. ఒకరు అసూయ పడేలా బ్రతుకు. కానీ ఒకరిపై అసూయ పడకు… అసూయ పడేవాళ్ళ దగ్గరకు వెళ్ళకు. ఆహరం దగ్గర వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదని పెద్దలు చెపుతారు. నమ్మకుంటేనే ఏ పనైనా చెయ్… ఎవరో ఏదో అంటారని, అనుకుంటారని కాదు. ఎందుకంటే ఈ జీవితం నీది… ఇతరులది కాదు. ఒకవేళ ఏ విషయంలోనైనా మొహమాటపడాల్సి వస్తే మరోసారి అలోచించు… కానీ డబ్బు విషయంలో మాత్రం అస్సలు మొహమాటపడొద్దు.

Shoban Babu Cinema Life History

కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్లుగా డబ్బు ఎలా వస్తుందో తెలీదు. అలాగే ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు ఎలా మాయమవుతుందో తెలీదు. డబ్బు కూడా అలాగే మాయమవుతుంది. అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఎవ్వరికి అప్పు ఇవ్వొద్దు… ప్రాణం పోయినా అప్పు తీసుకోకు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకు. ఉన్నవారు ఖర్చు పెట్టకపోతే పిసినారి అంటారు. అంతా ఖర్చు చేసి బికారి అయిపోతే కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. అనుభవంలోకి వస్తే అన్నీ నీకే అర్థమవుతాయి” అన్నారు. అప్పటికి శోభన్ బాబు వయసు 21 సంవత్సరాలు. ఆ వయసులో ఆయనకు తాతగారు చెప్పిన మాటలు పురాణ ప్రవచనాల్లా అన్పించాయి. అంతా అర్థం అయినట్లుగానే అన్పించింది. కానీ అప్పుడు శోభన్ బాబుకు ఏమీ అర్థం కాలేదు. నిజమే కదా… జీవితంలో అనుభవాన్ని మించిన పాఠం ఏముంటుంది ?

ntr-with-shobhan-babu shobhan-babu shobhan-babu

ఇవి కూడా చదవండి

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

 

Related posts